పాపికొండల పార్క్‌లో మగ పులి విడుదల
జియో ట్యాగింగ్‌తో 24 గంటల పర్యవేక్షణ
సాయంత్రం తర్వాత అప్రమత్తంగా ఉండాలని సూచనలు
పశువుల నష్టం పట్ల నష్టపరిహారం హామీ
గిరిజన యువతకు టూరిజం ద్వారా ఉపాధి అవకాశాలు
గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఫిబ్రవరి 24 :
రంపచోడవరం పరిసర అటవీ ప్రాంతాలలో పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని రంపచోడవరం డివిజనల్ ఫారెస్ట్ అధికారి శివకుమార్ గంగల్ తెలిపారు. మంగళవారం స్థానిక డివిజనల్ ఫారెస్ట్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇటీవల పాపికొండల నేషనల్ పార్క్ పరిధిలో మగ పెద్దపులిని వదిలినట్లు ఆయన వెల్లడించారు. నల్లమల అడవులు ప్రాంతంలో మగ పులులు అధికంగా ఉండటంతో పరస్పర ఘర్షణలు జరిగే అవకాశముండటంతో, ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మగ పులిని నేషనల్ పార్క్‌లో విడుదల చేసినట్లు వివరించారు.ప్రజలు సాయంత్రం 6 గంటల తర్వాత ఒంటరిగా బయట తిరగకూడదని, చిన్నపిల్లలను రాత్రివేళల్లో బయటకు పంపకూడదని సూచించారు. ఎక్కడైనా ఆవులు, మేకలు పులి బారిన పడినట్లయితే ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ పులికి జియో ట్యాగింగ్ సిస్టమ్ అమర్చినట్లు, 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు డీఎఫ్‌ఓ పేర్కొన్నారు. పులి సంచారం పూర్తిగా తగ్గేవరకు గ్రామాల్లో ఫారెస్ట్ సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.అదేవిధంగా, నేషనల్ పార్క్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత ఈ ప్రాంత గిరిజన యువతకు టూరిజం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.



