చింతూరు, పెన్ పవర్ ఏప్రిల్ 21:
పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రభావిత నిర్వాసితులకు పునరావాస కాలనీల్లోనే రేషన్ బియ్యం అందించాలని ఆదివాసి గిరిజన సంఘం నాయకులు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిని కోరారు. ఈ మేరకు మంగళవారం చింతూరులోని ఐటిడిఏ కార్యాలయంలో పి.ఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. నాయకులు మాట్లాడుతూ, వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామపంచాయతీ పరిధిలోని కల్తునూరు గ్రామ నిర్వాసితులకు ఎటపాక మండలం కన్నాయిగూడెంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ ఇంకా రోడ్లు, మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించాల్సి ఉందని తెలిపారు. వరదల ఇబ్బందుల కారణంగా సుమారు 50 కుటుంబాలు ఏడాది క్రితమే ఆ కాలనీలోకి వెళ్లి నివసిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, రేషన్ బియ్యం పొందడానికి ప్రతి నెల ఈకేవైసీ, బియ్యం కోసం సుమారు 170 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందని, దీనికి ఒక్కొక్క కుటుంబం రూ.300 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పునరావాస కాలనీల్లోనే ఈకేవైసీ చేసి రేషన్ బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి, తక్షణమే ప్రత్యేక అధికారులను పునరావాస కాలనీల్లో నియమించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పులి సంతోష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు సీసం సురేష్, నాయకులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

