ePaper
Wednesday, April 8, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆగమ్యగోచరంగా ఏపీ ఆర్థిక భవిష్యత్తు..

ఆగమ్యగోచరంగా ఏపీ ఆర్థిక భవిష్యత్తు..

 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కాగ్ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పుల్లో ఎక్కువ భాగం ఉత్పాదక రంగాలకు కాకుండా జీతాలు, వడ్డీలు, సంక్షేమ పథకాలకే వెళ్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు పరిమితులు దాటడం ఖజానాపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. ఓవర్‌డ్రాఫ్ట్‌లు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులపై ఆధారపడటం సంక్షోభ తీవ్రతను చూపిస్తోంది. పెట్టుబడి వ్యయాన్ని పెంచకపోతే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు మరింత అనిశ్చితిలో పడే ప్రమాదం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి.

  • అప్పుల్లో 75% అనుత్పాదక ఖర్చులకే
  • రెవెన్యూ లోటు FRBM లక్ష్యాన్ని దాటింది
  • ఆర్బీఐ అడ్వాన్సులపై రోజువారీ ఆధారపడటం
  • పెట్టుబడి వ్యయం తగ్గడం వల్ల సంపద సృష్టి మందగింపు
  • డెట్ ట్రాప్ ముప్పుతో రాష్ట్ర ఖజానా
    
  • కాగ్ గణాంకాలతో హెచ్చరిక గంటలు

స్టేట్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ , ఏప్రిల్ 7:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ వెల్లడించిన గణాంకాలు భవిష్యత్తుకు గట్టి హెచ్చరికలుగా మారాయి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ఆదాయ-వ్యయాల సమతుల్యతను నిలబెట్టడంలో విఫలమవుతోంది. రాష్ట్రం తీసుకొస్తున్న అప్పుల్లో కేవలం 24 శాతం మాత్రమే రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల వంటి అభివృద్ధి పనులకు వెళ్తుండగా, మిగిలిన 75 శాతం పైగా జీతాలు, పెన్షన్లు, పాత అప్పుల వడ్డీలు, సంక్షేమ పథకాలకే వినియోగమవుతోంది. దీంతో రాష్ట్రం అప్పు తెచ్చి అప్పు కట్టే డెట్ ట్రాప్‌లోకి జారిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2024-25లో రెవెన్యూ లోటు FRBM చట్టం నిర్దేశించిన 2.7 శాతం లక్ష్యాన్ని దాటి 3.75 శాతానికి చేరుకుంది. గత రెండేళ్లలోనే సుమారు రూ.3.20 లక్షల కోట్ల కొత్త అప్పులు చేయడం ఖజానాపై భారాన్ని మరింత పెంచింది.ఇక రోజువారీ ఖర్చుల కోసం ప్రభుత్వం ఆర్బీఐ వద్ద ఓవర్‌డ్రాఫ్ట్‌లు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులపైనే ఆధారపడటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. 2024-25లో కేవలం 8 రోజులు తప్ప మిగిలిన అన్ని రోజులు అడ్వాన్సుల ద్వారానే నిధులు సమకూర్చుకోవడం గమనార్హం. ఏడాదిలో రూ.1.72 లక్షల కోట్ల మేర ఈ రూపంలో నిధులు తీసుకోవడం వడ్డీ భారాన్ని మరింత పెంచుతోంది.ఆర్థిక నిపుణుల సూచనల ప్రకారం ప్రభుత్వం సంక్షేమ ఖర్చులతో పాటు సంపద సృష్టించే రంగాలపై పెట్టుబడులు పెంచాలి. పారిశ్రామికీకరణ, వాణిజ్య అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వకపోతే రాబోయే తరాలపై భారీ అప్పు భారం పడే ప్రమాదం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular