కుటుంబ విహారయాత్రలో విషాదం
మణిక్యధార వద్ద అదృశ్యమైన శ్రీనంద
డ్రోన్లతో నాలుగు రోజుల గాలింపు
2,000 అడుగుల లోయలో మృతదేహం
ప్రమాదమా? ఇతర కారణాలా? దర్యాప్తు వేగం
కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని శ్రీనంద (14) కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని చిక్కమగళూరుకు విహారయాత్రకు వెళ్లి విషాదాంతానికి దారితీసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి సుమారు 40 మంది కలిసి ముల్లైయనగిరి, చంద్రద్రోణ పర్వత ప్రాంతాలు, మణిక్యధార జలపాతం ప్రాంతాలను సందర్శించారు.
న్యూస్ డెస్క్ పెన్ పవర్| ఏప్రిల్ 11:
కుటుంబ సభ్యులతో ఆనందంగా విహారయాత్రకు వెళ్లిన 14 ఏళ్ల కేరళ విద్యార్థిని శ్రీనంద తిరిగి రాని లోకాలకు వెళ్లడం హృదయ విదారకంగా మారింది. పాలక్కాడ్‌కు చెందిన ఈ బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి సుమారు 40 మందితో కలిసి కర్ణాటకలోని చిక్కమగళూరు పర్యాటక ప్రాంతాలకు వెళ్లింది. సాయంత్రం తిరుగు ప్రయాణంలో శ్రీనంద ఒక్కసారిగా అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు, అటవీ శాఖ, విపత్తు సహాయక బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, ప్రత్యేక బృందాల సహాయంతో నాలుగు రోజుల పాటు ముమ్మరంగా గాలించారు. చివరికి మణిక్యధార జలపాతం సమీపంలోని సుమారు 2,000 అడుగుల లోతైన లోయలో శ్రీనంద మృతదేహం గుర్తించారు. అనంతరం సహాయక సిబ్బంది తాళ్ల సహాయంతో లోయలోకి దిగి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? సెల్ఫీ తీసుకుంటూ జారి పడిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా మృతి కారణాలపై స్పష్టత రానుంది. ఈ కేసుపై చిక్కమగళూరు ఎస్పీ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ, “మృతదేహం లభ్యమైంది. ప్రమాదమా , ఆత్మహత్య..? లేక ఇంకా ఏమైనా ఇతర కోణాలు ఉన్నాయా అని అన్నీ కోణాల్లో పరిశీలిస్తున్నాం. పూర్తి వివరాలు పోస్ట్‌మార్టం తర్వాత తెలుస్తాయి” అని తెలిపారు.

