Homeజీవన విధానంమన్యంలో మళ్లీ బాక్సైట్ భూతం..!, "జర్రెల కొండల్లో కలకలం", 

మన్యంలో మళ్లీ బాక్సైట్ భూతం..!, “జర్రెల కొండల్లో కలకలం”, 

సర్వే బృందాన్ని నిలదీసిన గిరిజనులు”

## బాక్సైట్ శాంపిళ్ల స్వాధీనం.. అధికారుల విచారణకు డిమాండ్

గూడెం కొత్త వీధి, జూన్ 18 (పెన్ పవర్): అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం జర్రెల బ్లాక్‌లో బాక్సైట్ అంశం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. గతంలో గిరిజనుల తీవ్ర వ్యతిరేకతతో బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదనలు నిలిచిపోయిన నేపథ్యంలో, తాజాగా బాక్సైట్ శాంపిళ్ల సేకరణ, సర్వే కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమవడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు.స్థానికుల సమాచారం మేరకు ఓ కంపెనీకి చెందిన సర్వే బృందం జర్రెల బ్లాక్ పరిధిలోని కొండ ప్రాంతాలకు చేరుకుంది. ఈ సందర్భంగా బాక్సైట్ శాంపిళ్లను సేకరించి వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించిన గిరిజనులు వెంటనే అప్రమత్తమై వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనాలను తనిఖీ చేయగా మట్టి నమూనాలు, సర్వేకు సంబంధించిన పరికరాలు కనిపించడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.అనంతరం సర్వే బృందాన్ని స్థానికులు పంచాయతీ కార్యాలయానికి తరలించి నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల గిరిజనులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు.సమాచారం అందుకున్న చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా, సీఐ వినోద్‌బాబు, గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్ బాబు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని గిరిజనులతో చర్చించారు. గంటకు పైగా జరిగిన చర్చల అనంతరం ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ, తమ భూములు, అడవులు, జలవనరులు, జీవనాధారాలను కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు. గ్రామసభల అనుమతి లేకుండా ఎలాంటి సర్వేలు, తవ్వకాలు, ఖనిజ నమూనాల సేకరణ చేపట్టినా తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. బాక్సైట్ తవ్వకాల వల్ల పర్యావరణానికి, అటవీ సంపదకు, గిరిజనుల జీవన విధానానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ, మన్యంలో ఇటువంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.చర్చల అనంతరం సర్వే బృంద సభ్యులను చింతపల్లికి తరలించారు. అయితే సర్వేకు సంబంధించిన సంస్థ వివరాలను అధికారులు వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular