లారీ బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు
చింతూరు, పెన్ పవర్, జూన్ 22:
ఏడుగురాళ్లపల్లి గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం బియ్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లారీలో భారీ మొత్తంలో బియ్యం లోడు ఉండగా, వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కకు ఒరిగి బోల్తాపడింది. ప్రమాదం కారణంగా బియ్యం సంచులు చెల్లాచెదురుగా పడిపోయి, కొన్ని సంచులు చినిగిపోవడంతో బియ్యం రోడ్డుపై, పక్కనున్న ప్రదేశంలో చెల్లాచెదురైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తలకు, చేతులకు తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపిన కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనతో కొంతసేపు ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

