ప్రజారాజ్యం నుంచి వైసీపీ వరకు అవంతి రాజకీయ ప్రయాణం
ఎన్నికల తర్వాత రాజకీయ నిశ్శబ్దం వీడుతున్న మాజీ మంత్రి
జనసేన వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం
నియోజకవర్గాల పునర్విభజనపై అవంతి లెక్కలు
ఉత్తరాంధ్రలో బలమైన నాయకత్వం కోసం జనసేన ప్రయత్నాలు
అవంతి తదుపరి రాజకీయ అడుగుపై ఆసక్తికర చర్చ
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోందా? ప్రజారాజ్యం నుంచి టీడీపీ, అక్కడి నుంచి వైసీపీ వరకు రాజకీయ ప్రయాణం సాగించిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పుడు జనసేన వైపు అడుగులు వేయబోతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విశాఖపట్టణం, పెన్ పవర్, జూన్ 24 :
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసుకుంటూ ముందుకు సాగే నాయకుల్లో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ ఒకరు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు మరోసారి ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ మొదలైంది.గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయంగా కొంత నిశ్శబ్దంగా ఉన్న అవంతి శ్రీనివాస్, మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి వస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఆయన తదుపరి రాజకీయ అడుగు జనసేన వైపేనన్న ప్రచారం విశాఖ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
మూడు పార్టీల్లో ప్రస్థానం.. మూడు విజయాలు : అవంతి శ్రీనివాస్ రాజకీయ ప్రయాణం ప్రత్యేకమైనది. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమిలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అనంతరం 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా విజయం సాధించి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మూడు వేర్వేరు పార్టీల నుంచి ఎన్నికల్లో గెలిచిన అరుదైన నాయకుల్లో అవంతి ఒకరిగా నిలిచారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త లెక్కలు : 2024 ఎన్నికల అనంతరం వైసీపీ అధికారాన్ని కోల్పోయిన కొద్దికాలానికే అవంతి పార్టీకి దూరమయ్యారు. వైసీపీ విధానాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ బయటకు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత విద్యాసంస్థల నిర్వహణ, వ్యాపార వ్యవహారాలపై దృష్టి పెట్టినప్పటికీ, రాజకీయాలకు పూర్తిగా దూరం కాలేదన్న సంకేతాలు ఆయన సన్నిహితుల ద్వారా వినిపిస్తున్నాయి.
జనసేన వైపు మొగ్గు చూపడానికి కారణాలేమిటి? : రాజకీయ వర్గాల అంచనాల ప్రకారం అవంతి జనసేన వైపు ఆకర్షితులవ్వడానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో గతం నుంచి ఉన్న అనుబంధం, కాపు సామాజికవర్గంలో ఉన్న ప్రభావం, భవిష్యత్ రాజకీయ అవకాశాలు వంటి అంశాలు ఆయన నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.అదే సమయంలో జనసేన భవిష్యత్‌లో మరిన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశాలపై కూడా అవంతి ఆశావహంగా ఉన్నారని చెబుతున్నారు.
పునర్విభజన రాజకీయాల్లో కొత్త అవకాశాలు : నియోజకవర్గాల పునర్విభజన జరిగితే భీమిలి ప్రాంతంలో కొత్త రాజకీయ అవకాశాలు వస్తాయని అవంతి వర్గం భావిస్తున్నట్లు సమాచారం. భీమిలి విభజన జరిగితే కొత్త అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉండటంతో అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలను ఆయన పరిశీలిస్తున్నారన్న చర్చ సాగుతోంది. మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోనూ రాజకీయ అవకాశాలను అంచనా వేస్తున్నారని తెలుస్తోంది.
జనసేనకు బలమైన నాయకత్వం అవసరమా? : ఉత్తరాంధ్రలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టిన జనసేనకు అనుభవజ్ఞులైన నాయకులు అవసరమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులలో ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి స్థాయి నాయకుడైన అవంతి శ్రీనివాస్ వంటి వ్యక్తి చేరితే పార్టీకి సంస్థాగతంగా, ఎన్నికల పరంగా ప్రయోజనం ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏదీ లేకపోవడం గమనార్హం.
రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ : ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ తాను రాజకీయంగా తటస్థంగా ఉన్నానని చెబుతున్నప్పటికీ, ఆయన తదుపరి అడుగుపై విశాఖ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.జనసేనలో చేరికపై వస్తున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చే పరిణామాలు చోటుచేసుకుంటాయా? లేక అవంతి మరో రాజకీయ వ్యూహంతో ముందుకు వస్తారా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

