పునర్వ్యవస్థీకరణ చేసిన 10 జోన్లలో పీజీఆర్ఎస్ నిర్వహణ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 5: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ – PGRS) కార్యక్రమాన్ని సోమవారం (జులై 6) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.ఈ కార్యక్రమం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు పునర్వ్యవస్థీకరణ చేసిన భీమిలి, మధురవాడ, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, పెందుర్తి, గాజువాక, అగనంపూడి, అనకాపల్లి జోన్ల కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, నీటి సరఫరా, వీధి దీపాలు, హార్టికల్చర్, రెవెన్యూ, యూసీడీ, ఇంజినీరింగ్ తదితర జీవీఎంసీ శాఖలకు సంబంధించిన సమస్యలపై నగర ప్రజలు అర్జీల ద్వారా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని కమిషనర్ పేర్కొన్నారు. అందిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి తగిన చర్యలు చేపడతారని తెలిపారు.
పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మూడు జోన్ల కార్యాలయాల వేదికల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. వెస్ట్ జోన్ పీజీఆర్ఎస్ కార్యక్రమం 52వ వార్డు ఎన్‌ఏడీ కొత్త రోడ్డు, గౌరీనగర్‌లోని పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించనున్నారు. నార్త్ జోన్ కార్యక్రమం 51వ వార్డు మాధవధార యూడీఏ లేఅవుట్, ఆర్టీఏ కార్యాలయ రోడ్డులోని పంప్ హౌస్ వెనుక ఉన్న ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో జరుగుతుంది. అగనంపూడి జోన్ కార్యక్రమం 85వ వార్డు పెదమడక శివాలయం రోడ్డులోని వినాయక ఆలయం సమీపంలోని రాజీవ్ గాంధీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు.
మిగిలిన అన్ని జోన్లలో పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా ఆయా జోనల్ కార్యాలయాల్లోనే నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

