Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంవిశాఖ నీటి సంక్షోభంపై వాసుపల్లి వార్

విశాఖ నీటి సంక్షోభంపై వాసుపల్లి వార్

విశాఖ నీటి సంక్షోభంపై వాసుపల్లి వార్

కాళీ బిందెలతో మహిళల నిరసన

రోజుకు 40 కోట్ల లీటర్ల అవసరం.. 32 కోట్ల లీటర్లే సరఫరా

డేటా సెంటర్‌కు 180 కోట్ల లీటర్ల నీరు ఎలా ఇస్తారు?

“2 టీఎంసీలు అంటే మూడు అక్షరాలు కాదు భరత్‌” — వాసుపల్లి

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్         విశాఖపట్నం, ఆగస్టు 14: విశాఖ నగరాన్ని పట్టిపీడిస్తున్న నీటి సంక్షోభంపై వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జగదాంబ జంక్షన్‌లో ఆయన ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో భారీ నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ.. “చంద్రబాబు పాలన అంటేనే అతివృష్టి లేదా అనావృష్టి” అని విమర్శించారు. ప్రశాంత విశాఖ నగరంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో రోజుకు సుమారు 40 కోట్ల లీటర్ల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 32 కోట్ల లీటర్ల మేరకే సరఫరా జరుగుతోందని, దీంతో రోజుకు 8 కోట్ల లీటర్ల కొరత ఏర్పడుతోందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులకు ఒకసారి నీరు వస్తుండగా, మరికొన్ని చోట్ల కలుషిత, బురద నీరు సరఫరా అవుతోందని ఆరోపించారు.

“2 టీఎంసీలు అంటే మూడు అక్షరాలు కాదు భరత్‌”

విశాఖ ఎంపీ శ్రీభరత్‌ నీటి అవసరాలపై చేసిన వ్యాఖ్యలను వాసుపల్లి తీవ్రంగా తప్పుబట్టారు. “2 టీఎంసీల నీరు మాత్రమే అవసరమని తేలికగా మాట్లాడటం హాస్యాస్పదం. టీఎంసీ అంటే మూడు అక్షరాల పదం కాదు.. దాని వెనుక ఉన్న నీటి పరిమాణాన్ని అర్థం చేసుకోవాలి” అని అన్నారు.

నగరానికి అవసరమైన అదనపు 8 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేయలేని జీవీఎంసీ, ప్రతిపాదిత డేటా సెంటర్‌కు రోజుకు 180 కోట్ల లీటర్ల నీటిని ఎలా అందిస్తుందని ప్రశ్నించారు. డేటా సెంటర్‌ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

“విశాఖను నీటి ఎడారిగా మార్చొద్దు”

మేఘాద్రిగెడ్డ, ముడసర్లోవ వంటి జలవనరులు ఎండిపోతున్నాయని, భూగర్భ జలమట్టాలు కూడా తగ్గిపోతున్నాయని వాసుపల్లి పేర్కొన్నారు. నీటి కోసం పశుపక్షాదులు కూడా అడవులను వీడి రోడ్లపైకి వస్తున్నాయని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు సైతం విశాఖను వదిలి వలస వెళ్లే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

నగర ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించకుండా భారీ ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం సరికాదన్నారు. డేటా సెంటర్‌ ఏర్పాటును పునఃపరిశీలించి, విశాఖ ప్రజల తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

నీటి సరఫరాకు 5 శాతమేనా?

జీవీఎంసీకి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ, నీటి సరఫరా వ్యవస్థకు తగిన స్థాయిలో నిధులు కేటాయించడం లేదని వాసుపల్లి ఆరోపించారు. ప్రజల మౌలిక అవసరాలైన తాగునీరు, మౌలిక వసతులపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్భాట కార్యక్రమాలకు భారీగా ఖర్చు చేసే నిధులను నగర మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ దక్షిణ నియోజకవర్గంలో నీటి నిల్వ సామర్థ్యం పరిమితంగా ఉన్నప్పటికీ నిత్యం నీటి సరఫరా అందించామని వాసుపల్లి గుర్తుచేశారు.

“పవన్‌ ప్రయారిటీ ఏమిటో అర్థం కావడం లేదు”

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని వాసుపల్లి డిమాండ్‌ చేశారు. విశాఖలో తీవ్రమవుతున్న నీటి సమస్యపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అనంతరం రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ చైర్మన్‌ జాన్‌ వెస్లీ మాట్లాడుతూ విశాఖలో నీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీ లింగం శ్రీను, ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చెన్నా జానకిరామ్‌, మాజీ కార్పొరేటర్లు, జిల్లా మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడు కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్‌, బిపిన్‌ జైన్‌, వార్డు అధ్యక్షులు నీలపు సర్వేశ్వరరెడ్డి, పీతల వాసు, దస్మాంతుల మాణిక్యాలరావు, దొడ్డి బాపు ఆనంద్‌, పిన్నింట్లో రాజారెడ్డి, ముత్తబత్తుల రమేష్‌, ఆలుపున కనకరెడ్డి, మహమ్మద్‌ షకీల్‌, గురజారపు రవి, ముజీబ్‌ఖాన్‌, కోడిగుడ్ల శ్రీధర్‌, భీశెట్టి ప్రసాద్‌, పచ్చిపల్లి రాము తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular