షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు.. సకాలంలో స్పందించిన స్థానికులు
వేటపాలెం, సెప్టెంబర్ 23, (పెన్ పవర్) :
వేటపాలెం మండలం, చల్లారెడ్డి పాలెం పంచాయితీ పరిధిలోని కొణిజేటి చేనేతపురి కాలనీలో బుధవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. కాలనీలోని 229వ నంబర్ ఇంట్లో సప్రం లక్ష్మి నివాసంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌తో పాటు వంట సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంటి నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వారి సమయస్ఫూర్తి, ఐకమత్యంతో మంటలు ఇతర ఇళ్లకు వ్యాపించకుండా నివారించగలిగారు.
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబం ఇంట్లో ఈ ఘటన జరగడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో పాటు విద్యుత్ హెచ్చుతగ్గులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు ఫ్రిజ్‌లు, ఏసీలు, టీవీలు, ఇతర విద్యుత్ పరికరాలను ఆపివేయడంతో పాటు, అవసరమైతే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని పేర్కొన్నారు. విద్యుత్ హెచ్చుతగ్గుల కారణంగా పరికరాలు దెబ్బతినడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినప్పుడు వాటిపై నీరు పోయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తే విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ఇసుక లేదా తగిన అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి మంటలను అదుపు చేయాలి. ప్రమాద సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

