టికెట్ దక్కకపోతే నామినేషన్ వేస్తా.. మాజీ సర్పంచ్ స్పష్టం
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 23:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్న వారిలో దామనపల్లి మాజీ సర్పంచ్ కుందరి రామకృష్ణ కూడా ఉన్నారు. పార్టీ టికెట్ కేటాయింపులో తనకు అవకాశం కల్పించకపోతే రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన శుక్రవారం తెలిపారు. పార్టీ బలోపేతం కోసం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సేవలందించానని కుందరి రామకృష్ణ పేర్కొన్నారు. దామనపల్లి సర్పంచ్‌గా రెండుసార్లు విజయం సాధించి, ఆ ప్రాంతాన్ని వైసీపీకి బలమైన స్థానంగా మార్చేందుకు కృషి చేశానన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ వచ్చిన తన పేరు కూడా టికెట్ ఆశావహుల జాబితాలో ఉందని తెలిపారు. అయినప్పటికీ తనకు టికెట్ కేటాయించకుండా అన్యాయం చేయడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకత్వం తనకు అవకాశం కల్పించాలని కోరారు. టికెట్ కేటాయింపుపై సానుకూల నిర్ణయం రాకపోతే నామినేషన్ దాఖలు చేస్తానని స్పష్టం చేశారు.కుందరి రామకృష్ణ ప్రకటనతో గూడెంకొత్తవీధి మండల వైసీపీలో జడ్పీటీసీ అభ్యర్థి ఎంపికపై రాజకీయ చర్చకు తెరలేచింది. పార్టీ నాయకత్వం టికెట్ ఎవరికి కేటాయిస్తుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

