Homeఎడిటోరియల్నాలుగు వారాల్లో చర్యల నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం

నాలుగు వారాల్లో చర్యల నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం

ఎంవీఎస్‌ఆర్ కళాశాల ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందన

ఎల్బీనగర్, పెన్ పవర్ అక్టోబర్ 30:

రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ఘటనపై అవసరమైన చర్యలు తీసుకొని నాలుగు వారాల్లోగా చర్యల నివేదిక సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, పోలీస్ కమిషనర్‌, మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. కేసు నంబర్ 1051/36/9/2026కు సంబంధించి సభావట్ కళ్యాణ్, కరుపోతుల రేవంత్ సమర్పించిన ఫిర్యాదుపై అక్టోబర్ 28న ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 17న కళాశాలలో నిర్వహించిన ‘సంగమం–2026’ ఉత్సవాల్లో డాండియా వేడుకలు జరుగుతుండగా భారీ లోహపు లైటింగ్ ట్రస్‌, దాని ఆధార స్తంభాలు కూలిపోయాయి. ఈ ఘటనలో సోనీ, మీనా అనే ఇద్దరు విద్యార్థినులు మృతి చెందగా, మరో 12 నుంచి 14 మంది విద్యార్థులు గాయపడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో కార్యక్రమాల నిర్వహణ, తాత్కాలిక నిర్మాణాల భద్రత, జనసమూహ నియంత్రణలో నిర్లక్ష్యంపై ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని, గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం కల్పించాలని కోరారు. నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు విద్యాసంస్థల్లో భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర చర్యలు చేపట్టాలని సభావట్ కళ్యాణ్ (ఢిల్లీ విశ్వవిద్యాలయ న్యాయ విద్యార్థి), అడ్వకేట్ కరుపోతుల రేవంత్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular