చర్లపల్లిలో జయశంకర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం
రూ.7 కోట్లతో ఆధునిక క్రీడా, ఆరోగ్య సదుపాయాలు
ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరు
స్థానిక యువతకు ఉపాధి కల్పనలో పరిశ్రమలు ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి
కాప్రా, పెన్ పవర్, నవంబర్ 6:
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఆధునిక క్రీడా, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. చర్లపల్లి చర్లపల్లి నోటిఫైడ్ మున్సిపల్ ఇండస్ట్రీయల్ ఏరియాస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఫెజ్ 2లో రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన జయశంకర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆధునిక జిమ్, ఈఎస్ఐ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్,ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న చర్లపల్లి ప్రాంతంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు యువతకు క్రీడా అవకాశాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలు యువతలో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.
పరిశ్రమలు.. స్థానిక యువతకు ఉపాధి
చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ప్రస్తుతం సుమారు 80వేల నుండి వేల 90వేల మందికి ఉపాధి లభిస్తుందని, భవిష్యత్తులో ఈ సంఖ్యను రెండు లక్షలకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగాలని పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక ప్రజల సంక్షేమం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించాలని అన్నారు. పారిశ్రామిక ప్రగతి ఫలాలు స్థానిక ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
యువతకు ఎంతో ఉపయోగకరం: ఎంపీ ఈటల రాజేందర్
మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఆధునిక క్రీడా సదుపాయాలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. యువత క్రీడల వైపు ఆసక్తి చూపేలా ప్రోత్సహించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి మౌలిక వసతులు దోహదపడతాయని తెలిపారు. అదేవిధంగా మల్కాజ్గిరి పరిధిలో పెరుగుతున్న జనాభా నగరికరణకు అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 24 రైల్వే బ్రిడ్జిలు మంజూరు చేసినట్లు కార్యక్రమంలో తెలిపారు.స్థానిక అభివృద్ధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
అభివృద్ధికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. చర్లపల్లి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. క్రీడా, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రావడం ద్వారా స్థానిక యువతతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
విఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ రాము నేతృత్వంలో పారిశ్రామికవేత్తల సహకారంతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బాక్స్ క్రికెట్, నెట్ క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు, పికిల్‌బాల్ కోర్టు, ఆధునిక జిమ్, సమావేశ మందిరం తదితర సదుపాయాలు ఏర్పాటు చెయ్యడం అభినందినియమన్నారు. రూ.7 కోట్లతో నిర్మించిన జయశంకర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆధునిక క్రీడా, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రావడంతో చర్లపల్లి, పరిసర ప్రాంతాల యువతకు మెరుగైన వేదిక లభించినట్లయిందన్నారు.పారిశ్రామిక అభివృద్ధితో పాటు క్రీడా, ఆరోగ్య రంగాల్లోనూ చర్లపల్లి మరింత అభివృద్ధి చెందేందుకు ఈ సదుపాయాలు దోహదపడనున్నాయని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి ఐల చైర్మన్ డాక్టర్ కె.గోవింద్ రెడ్డి, ఉపాధ్యక్షుడు తాటి శ్రీనివాస్, తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, స్థానిక నాయకులు, క్రీడాకారులు, యువత తదితరులు పాల్గొన్నారు.

