కైలాసగిరి బస్సు ప్రమాదంపై కలెక్టర్ తక్షణ స్పందన
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం.. విద్యార్థులు, ఉపాధ్యాయులను సురక్షితంగా స్వస్థలానికి తరలించేందుకు చర్యలు
ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి స్వల్ప గాయాలు – మెడికవర్ ఆసుపత్రికి తరలింపు
బ్యూరో రిపోర్ట్, పెన్ పవర్, విశాఖపట్నం,నవంబర్ 28:
విశాఖపట్నంలోని కైలాసగిరి ఘాట్ రోడ్డులో పిఠాపురానికి చెందిన ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విహారయాత్ర బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ తక్షణమే స్పందించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి, క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు కల్పించాలని ఆదేశించారు.
పాఠశాలకు చెందిన మొత్తం ఎనిమిది బస్సుల్లో 240 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు విహారయాత్ర నిమిత్తం విశాఖపట్నానికి వచ్చారు. ఈ క్రమంలో 37 మంది ప్రయాణిస్తున్న ఒక బస్సు కైలాసగిరి ఘాట్ రోడ్డులో బ్రేకులు విఫలం కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి స్వల్ప గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే రూరల్ తహశీల్దార్, జిల్లా విద్యాశాఖ అధికారులను సంఘటనా స్థలానికి పంపించి పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రమాదానికి గురైన బస్సులోని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి, వారందరినీ విశాఖపట్నం నుంచి పిఠాపురానికి సురక్షితంగా తరలించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి కూడా స్పందించారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులకు అన్ని విధాలా అండగా నిలవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టడంతో బాధితులకు అవసరమైన వైద్య, రవాణా సదుపాయాలు కల్పించే ప్రక్రియ వేగవంతమైంది.

