కాకినాడ కొవ్వూరు బ్రిడ్జి వద్ద విషాదం.. టిప్పర్ లారీ ఢీకొని నలుగురు మృతి
కన్నీటి పర్యంతమైన చీడిగ గ్రామం.. ఇద్దరి పరిస్థితి విషమం
కాకినాడ, పెన్ పవర్ మే 16ః ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీల జీవితాల్లో శనివారం ఉదయం ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఫోటో తీసుకునేందుకు హైవే రోడ్డుపైకి వెళ్లిన కూలీలపై వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ బీభత్సం సృష్టించడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దుర్ఘటన కాకినాడ రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి హైవేపై చోటుచేసుకుంది.మృతులు కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలుగా గుర్తించారు. ప్రతిరోజులానే శనివారం తెల్లవారుజామున ఉపాధి పనుల కోసం వెళ్లిన కూలీలు కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో పనిచేస్తుండగా, అధికారులు సూచించిన విధంగా ఫోటో తీసుకునేందుకు హైవే రోడ్డుపైకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.ఫోటో పూర్తయ్యాక తిరిగి పనిస్థలానికి వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఒక్కసారిగా వారిపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయారు. కళ్లముందే తోటి కూలీలు ప్రాణాలు కోల్పోవడం చూసిన ఇతర మహిళా కూలీలు బోరున విలపించారు.“పని జరిగే ప్రదేశంలోనే ఫోటోలు తీస్తే ఇలాంటి ప్రమాదం జరిగేది కాదు. కేవలం ఫోటో కోసం హైవే ఎక్కడం వల్లే మా వాళ్లు చనిపోయారు” అంటూ మహిళా కూలీలు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబాలకు అండగా నిలిచే చేతులు ఒక్కసారిగా శాశ్వతంగా దూరం కావడంతో చీడిగ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఉపాధి కోసం వెళ్లిన అమాయక కూలీల ప్రాణాలను ఒక నిర్లక్ష్య క్షణం బలి తీసుకోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

