ePaper
Friday, June 12, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కర్నూలుగెలిచిన రెండేళ్లకే గ్రాఫ్ డౌన్..

గెలిచిన రెండేళ్లకే గ్రాఫ్ డౌన్..

📰 Generate e-Paper Clip

  • ఉమ్మడి కర్నూలు తమ్ముళ్లలో మొదలైన వణుకు!
  • రెండేళ్లలోనే రివర్స్ గేర్: పూర్వ వైభవానికి తూట్లు పొడుస్తున్న నేతలు!
  • ఆరోపణల వెల్లువ: ఇసుక దందాలు, భూకబ్జాలతో ప్రభుత్వానికి మరకలు!
  • కుప్పంలో ఏం జరిగింది? హాట్ టాపిక్‌గా మారిన బాబు యాక్షన్!
  • సమస్యల వలయంలో కీలక నియోజకవర్గాలు: నివేదికల్లో నిరూపణ!
  • అధిష్టానం వార్నింగ్ ఇచ్చినా మారని తీరు: నిఘా నీడలో ఎమ్మెల్యేలు!
  • ఒక్కరికి ట్రీట్‌మెంట్ ఇస్తే అందరూ సెట్: ‘కుప్పం ఫార్ములా’ వైపే మొగ్గు?

సుమారు రెండు దశాబ్దాల పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ, నాయకుల మధ్య విభేదాలు, వ్యక్తిగత ప్రతికూలతల వల్ల 2019 ఎన్నికల్లో జిల్లా నుంచి కనీసం ఒక్క అసెంబ్లీ, లోక్‌సభ సీటు కూడా గెలవలేకపోయింది. అయితే, 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంతో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 చోట్ల (టీడీపీ ఒంటరిగా 11), 2 లోక్‌సభ స్థానాల్లో ఘన విజయం సాధించి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. కానీ, గెలిచిన రెండేళ్లలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోందనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలు, అవినీతి ఆరోపణలు, అంతర్గత విభేదాల నేపథ్యంలో… చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో అమలు చేసిన ‘వ్యవహారాల ప్రక్షాళన’ (కుప్పం ఫార్ములా)ను ఇక్కడ కూడా ప్రయోగిస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో ‘పెన్ పవర్’ అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం:

2024లో సాధించిన అఖండ విజయం రెండేళ్లకే ఆవిరవుతోందా? ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొందరు కూటమి ఎమ్మెల్యేల అక్రమాలు, ఇసుక దందాలు, భూకబ్జాల పర్వం పార్టీ ప్రతిష్టను మసకబారుస్తోంది. సొంత నియోజకవర్గంలో తప్పు చేసిన నేతను క్షమించని చంద్రబాబు.. ఇప్పుడు కర్నూలుపై అదే తరహా ‘ఆపరేషన్ ప్రక్షాళన’కు సిద్ధమవుతున్నారా? క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉన్నా లీడర్ల మధ్య సమన్వయ లోపం.. 8 నుంచి 10 నియోజకవర్గాల్లో ముదిరిన అంతర్గత పొమ్మనలేక పొగబెట్టే రాజకీయం! అధిష్టానం హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న నేతలకు ‘కుప్పం తరహా సర్జరీ’ ఒక్కటే మార్గమా? జిల్లా తమ్ముళ్లలో హాట్ టాపిక్‌గా మారిన హైకమాండ్ నెక్స్ట్ స్టెప్!

2024 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ సాధించిన విజయం ఒక చరిత్ర. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ సీట్లను కైవసం చేసుకుని కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే, అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే సీన్ రివర్స్ అవుతోంది. క్షేత్రస్థాయిలో మళ్లీ పాత రోజులు పునరావృతమవుతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. ప్రజాసమస్యలను గాలికొదిలేసి, సొంత ఎజెండాతో దూసుకుపోతున్న కొందరు ప్రజాప్రతినిధుల తీరు వల్ల పార్టీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని అంతర్గత నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు, వారి ముఖ్య అనుచరుల ఆగడాలు మితిమీరిపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, వివాదాస్పద భూములపై కన్నేసి అక్రమ రిజిస్ట్రేషన్లతో కబ్జాలకు పాల్పడటం, సామాన్యులపై దౌర్జన్యాలు చేయడం వంటి ఘటనలు కూటమి ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. స్థానిక సంస్థల్లోనూ, కేడర్ స్థాయిలోనూ ఈ వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

పార్టీ క్రమశిక్షణ విషయంలో అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంత కఠినంగా ఉంటారో చెప్పడానికి ఇటీవల కుప్పంలో జరిగిన పరిణామాలే నిదర్శనం. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పార్టీ నేతలు గాడి తప్పుతున్నారని, కేడర్‌లో అసంతృప్తి పెరుగుతోందని గ్రహించిన చంద్రబాబు.. అక్కడ నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను ఉన్నఫళంగా పదవి నుంచి తప్పించారు. ఈ ‘స్పీడ్ అండ్ స్ట్రెయిట్ యాక్షన్’ ఇప్పుడు కర్నూలు నేతల్లో వణుకు పుట్టిస్తోంది.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 స్థానాల్లో దాదాపు 8 నుంచి 10 నియోజకవర్గాల్లో అంతర్గత విబేధాలు, వివాదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, డోన్, నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం వంటి నియోజకవర్గాల్లో సమస్యలు జటిలమయ్యాయి. సీనియర్ నేతలు పార్టీకి దూరం కావడం, ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలు పోతుండటంతో నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు ముదిరిపోయాయి.

ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన నియోజకవర్గాల పరిస్థితులపై ప్రత్యేక సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు, సదరు ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్, పార్టీ అంతర్గత సర్వే నివేదికలను నేరుగా వారి ముందుంచి ‘తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు’ అని స్పష్టం చేసినా, కొందరు నేతల్లో మార్పు రాకపోవడం గమనార్హం. దీంతో ఇక మాటలు ఉండవని, నేరుగా యాక్షనేనని అధిష్టాన వర్గాలు లీకులు ఇస్తున్నాయి.

ప్రస్తుతం కర్నూలు టీడీపీలో ఒకటే ప్రచారం సాగుతోంది. జిల్లాలోని ఏ ఒక్క వివాదాస్పద ఎమ్మెల్యేపైనైనా చంద్రబాబు వేటు వేసినా, లేదా బాధ్యతల నుంచి తప్పించినా.. మిగిలిన నియోజకవర్గాల నేతలంతా దారికి వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలపై అసంతృప్తితో ఉన్న స్థానిక ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటికే క్షేత్రస్థాయి అక్రమాలపై ఆధారాలను అధిష్టానానికి చేరవేస్తున్నారు. త్వరలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ‘కుప్పం తరహా సర్జరీ’ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular