ePaper
Thursday, June 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కర్నూలుకర్నూలు పాలిటిక్స్‌లో ‘టీజీ వర్సెస్ బైరెడ్డి’ వార్: 

కర్నూలు పాలిటిక్స్‌లో ‘టీజీ వర్సెస్ బైరెడ్డి’ వార్: 

📰 Generate e-Paper Clip

 రంగంలోకి దిగిన సీనియర్ నేత టీజీ వెంకటేష్!

రాయలసీమలో రాజుకున్న రాజకీయం: జోకర్ అన్న భరత్.. నాలుక కట్ చేస్తామన్న వెంకటేష్.. సిద్ధార్థ్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్!

 

న్యూస్ డెస్క్ పెన్ పవర్, జూన్ 11:

దళిత యువకుడి ఆత్మహత్య వివాదం కాస్తా కర్నూలు రాజకీయాల్లో అగ్గి రాజేసింది. వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, మంత్రి టీజీ భరత్ మధ్య మొదలైన సవాళ్లు, ప్రతిసవాళ్లు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. తాజాగా ఈ వివాదంలోకి మంత్రి తండ్రి, సీనియర్ నేత టీజీ వెంకటేష్ ఎంట్రీ ఇవ్వడంతో రాయలసీమ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ‘నోరు జాగ్రత్త.. లేదంటే కార్యకర్తలు నాలుక కట్ చేస్తారు’ అంటూ బైరెడ్డికి టీజీ వెంకటేష్ పరోక్షంగా ఇచ్చిన హెచ్చరికలు జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నాయి. వందమంది రౌడీలను తెస్తే.. మేము లక్ష మందిని తెస్తాం.. కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనకాడం! కర్నూలు వేదికగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై టీజీ వెంకటేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంచి కుటుంబాల్లోనూ దరిద్రులు పుడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మంత్రి టీజీ భరత్ సైతం బైరెడ్డిని ‘జోకర్’ గా అభివర్ణించి పరువునష్టం దావా వేస్తామని ప్రకటించడంతో, ‘పెన్ పవర్’ ప్రత్యేక విశ్లేషణ ప్రకారం ఈ ఫ్యాక్షన్ తరహా మాటల యుద్ధం సీమ రాజకీయాలను ఎటు వైపు తిప్పుతుందో అనే ఉత్కంఠ రేపుతోంది.

1. రాజుకున్న వివాదం: దళిత యువకుడి ఆత్మహత్యే కారణం
కర్నూలు జిల్లాలో సతీష్ అనే దళిత యువకుడి ఆత్మహత్య ఉదంతం రాజకీయ రంగు పులుముకుంది. సతీష్ మృతికి ఓ ఫార్మా కంపెనీకి సంబంధం ఉందంటూ, ఆ కంపెనీ నుంచి బాధితుడి కుటుంబానికి భారీగా డబ్బులు అందాయంటూ వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. బాధితులకు న్యాయం చేయాలని తాను పోరాడుతుంటే, అధికార పార్టీ తనను బెదిరిస్తోందని సిద్ధార్థ్ రెడ్డి ఆరోపించడంతో ఈ వివాదం కాస్తా వ్యక్తిగత విమర్శల వైపు మళ్లింది.

2. మంత్రి టీజీ భరత్‌పై అవినీతి ఆరోపణలు.. ‘జోకర్’ అంటూ కౌంటర్
యువకుడి ఆత్మహత్య వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి టీజీ భరత్‌ను టార్గెట్ చేస్తూ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి టీజీ భరత్ తీవ్రంగా స్పందించారు. బైరెడ్డి ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేస్తూ.. ఆయనొక ‘జోకర్’ అని ఎద్దేవా చేశారు. అనవసరంగా బురదజల్లాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సిద్ధార్థ్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తామని మంత్రి భరత్ హెచ్చరించారు.

3. సీన్‌లోకి సీనియర్ నేత: కుమారుడి కోసం రంగంలోకి టీజీ వెంకటేష్
మంత్రి టీజీ భరత్, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధం మరో మలుపు తిరిగింది. మంత్రి తండ్రి, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ఈ వివాదంలోకి ప్రత్యక్షంగా ప్రవేశించారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పేరును నేరుగా ప్రస్తావించకుండానే, ఆయన శైలిలో పరోక్షంగా అత్యంత ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఎగిరెగిరి పడుతున్న వాళ్లంతా కాలక్రమేణా చల్లారిపోయారనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

4. తాతల కాలం నాటి పరిచయాలు.. ‘మంచి కుటుంబంలో దరిద్రుడు’
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తాత తనకు అత్యంత ఆప్తుడని, ఆ పాత పరిచయంతోనే ఏడాది కిందట ఆ అబ్బాయికి (సిద్ధార్థ్ రెడ్డికి) మంచిగా మాట్లాడటం నేర్చుకోమని సలహా ఇచ్చానని టీజీ వెంకటేష్ గుర్తుచేశారు. “మంచి కుటుంబాల్లోనూ అప్పుడప్పుడూ కొందరు దరిద్రులు, నికృష్టులు పుడుతుంటారు. అలాంటి వారికి బుద్ధి చెప్పే విధానం వేరుగా ఉంటుంది. ఒకటి, రెండు సార్లు చూస్తాం.. ఆపై ఊరుకోం” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

5. మీసాలు తిప్పినోళ్లే దిగివచ్చారు.. బలప్రదర్శనకు సిద్ధం!
రాయలసీమ గడ్డపై పెద్ద పెద్ద వాళ్లే మీసాలు తిప్పి, ఆ తర్వాత మీసాలు దించుకుని తమతో సహకరించారని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఏదో వందమంది రౌడీలను ఎంబడేసుకుని తిరిగితే సరిపోదని హెచ్చరించారు. “వాళ్లు వందమందిని తెస్తే మేము వేయి మందిని, వాళ్లు వేయి మందిని తెస్తే మేము పదివేల మందిని, అవసరమైతే లక్ష మందిని తీసుకురాగలం. వాళ్లు లక్ష రూపాయలు ఖర్చు పెడితే.. నేను కోటి రూపాయలు ఖర్చు పెట్టగలను” అంటూ తన ఆర్థిక, అంగబలాన్ని ప్రదర్శిస్తూ సవాల్ విసిరారు.

6. హద్దులు దాటితే నాలుక కట్ చేస్తారు: తీవ్ర హెచ్చరిక
చివరగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నోరు పారేసుకునే అలవాటు మార్చుకోవాలని, హద్దులు దాటి మాట్లాడితే తాము శాంతంగా ఉన్నా తమ పార్టీ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మా కార్యకర్తలే ఎవరో ఒకరు వచ్చి నాలుక కట్ చేస్తారంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ పరిణామాలతో కర్నూలు జిల్లా రాజకీయం ఉప్పు-నిప్పులా మారిపోయింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular