ePaper
Thursday, June 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిఫీల్ గుడ్ ఇమేజ్... ఫీల్డ్‌లో అసంతృప్తి!

ఫీల్ గుడ్ ఇమేజ్… ఫీల్డ్‌లో అసంతృప్తి!

📰 Generate e-Paper Clip

లావుపై ఐవీఆర్ఎస్ ప్రకంపనలు… టీడీపీలో అంతర్గత కలకలం
వైసీపీ నుంచి టీడీపీ వరకు లావు రాజకీయ ప్రస్థానం
పదవుల పంపకాలపై పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి
గ్రూపు రాజకీయాల ఆరోపణలు మరింత బలపడుతున్నాయా?
ఎమ్మెల్యేలతో సమన్వయ లోపంపై చర్చ
ఐవీఆర్ఎస్ సర్వేతో బయటపడిన అంతర్గత అసమ్మతి
అధిష్టానం సంకేతమా… లేక సాధారణ ఫీడ్‌బ్యాక్ ప్రక్రియనా?

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుకు పార్టీ అధిష్టానం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న వేళ, ఆయన పనితీరుపై టీడీపీ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.పదవుల పంపకాల నుంచి గ్రూపు రాజకీయాల వరకు పలు అంశాలపై పార్టీ అంతర్గతంగా అసంతృప్తి పెరుగుతోందన్న ప్రచారం మధ్య ఈ సర్వే జరగడం పల్నాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పెన్ పవర్ ప్రత్యేక ప్రతినిధి గుంటూరు, జూన్ 11 :

పల్నాడు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయుల పేరు చుట్టూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకవైపు పార్టీ అధిష్టానం ఆయనకు విశేష ప్రాధాన్యం ఇస్తుండగా, మరోవైపు నియోజకవర్గ స్థాయిలో ఆయన వ్యవహారశైలిపై సందేహాలు, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం నిర్వహించినట్లు చెబుతున్న ఐవీఆర్ఎస్ సర్వే మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

వైసీపీ నుంచి టీడీపీ వరకు లావు రాజకీయ ప్రస్థానం : 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన లావు శ్రీకృష్ణదేవరాయులు, 2024 ఎన్నికల ముందు రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు పార్లమెంట్ స్థానానికి మారాలని వైసీపీ అధిష్టానం భావించగా, ఆయన ఆ నిర్ణయాన్ని అంగీకరించకుండా పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం టీడీపీలో చేరి నరసరావుపేట నుంచే పోటీ చేసి రెండోసారి ఎంపీగా గెలుపొందారు.

పదవుల పంపకాలపై పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి : టీడీపీలో చేరిన తర్వాత లావుతో కలిసి వచ్చిన పలువురు నేతలకు కీలక పదవులు లభించడం చర్చకు దారి తీసింది. వినుకొండకు చెందిన మక్కెన మల్లిఖార్జునరావుకు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు సభ్యత్వం రావడంలో ఎంపీ పాత్ర ఉందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమైంది. దీంతో చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న కొందరు నేతల్లో అసంతృప్తి పెరిగిందని సమాచారం. కొత్తగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం లభిస్తోందన్న భావన స్థానిక నాయకత్వంలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

గ్రూపు రాజకీయాల ఆరోపణలు మరింత బలపడుతున్నాయా? : లావు శ్రీకృష్ణదేవరాయులు పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం ఇటీవల బలపడుతోంది. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, టీడీపీలోనూ అదే విధానం కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీకి కొత్తగా వచ్చిన నాయకుల చుట్టూ ప్రత్యేక వర్గం ఏర్పడిందన్న చర్చ జరుగుతుండగా, ఇది భవిష్యత్తులో మరింత రాజకీయ ప్రభావం చూపే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యేలతో సమన్వయ లోపంపై చర్చ : నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో ఎంపీకి పూర్తిస్థాయి సమన్వయం లేదన్న ప్రచారం స్థానికంగా బలంగా వినిపిస్తోంది. కొందరు జనసేన నాయకులు ఎమ్మెల్యేపై తరచూ విమర్శలు చేయడం వెనుక ఎంపీ వర్గం ప్రోత్సాహం ఉందని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నట్లు సమాచారం. ఇతర నియోజకవర్గాల్లో బహిరంగ విభేదాలు బయటకు రాకపోయినా, అంతర్గతంగా అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం మాత్రం ఆగడం లేదు.

ఐవీఆర్ఎస్ సర్వేతో బయటపడిన అంతర్గత అసమ్మతి: ఇటీవల నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పలువురికి ఎంపీ పనితీరుపై ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. ప్రజల్లో ఆయనపై ఉన్న అభిప్రాయం, పార్టీ కార్యక్రమాల్లో చురుకుదనం, స్థానిక నాయకులతో సంబంధాలపై ప్రశ్నలు అడిగినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు అధిష్టానానికి అత్యంత చేరువైన నేతల్లో ఒకరిగా భావిస్తున్న లావుపై ఇలాంటి సర్వే నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అధిష్టానం సంకేతమా… లేక సాధారణ ఫీడ్‌బ్యాక్ ప్రక్రియనా? : ఈ సర్వే వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరు దీనిని సాధారణ ఫీడ్‌బ్యాక్ సేకరణగా భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఎంపీ వ్యవహారశైలిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధిష్టానం ప్రత్యేకంగా స్పందించిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ప్రస్తుతం నరసరావుపేట టీడీపీలో ఐవీఆర్ఎస్ సర్వే రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. పార్టీ అంతర్గత సమీకరణాలు ఏ దిశగా మలుపు తిరుగుతాయో, లావు శ్రీకృష్ణదేవరాయులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular