ప్రతీ టిడ్కో లబ్ధిదారుకు న్యాయం జరిగే వరకు పోరాటం
మౌలిక వసతులు యుద్ధప్రాతిపదికన కల్పించాలని డిమాండ్
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై
5 : టిడ్కో గృహాల ప్రతి లబ్ధిదారుకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. గాజువాక మండలం దువ్వాడ-తలారివానిపాలెం టిడ్కో గృహాల వద్ద ఆదివారం నిర్వహించిన లబ్ధిదారుల బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ సభకు అధ్యక్షత వహించారు.
జె.వి. సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ పుష్కర కాలంగా సొంత ఇంటి కోసం వేలాది మంది నిరుపేదలు ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా లబ్ధిదారుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదన్నారు. సొంత ఇంటి ఆశతో అప్పులు చేసి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. పూర్తయిన టిడ్కో గృహాలకు విద్యుత్, తాగునీరు, రహదారులు, మురుగునీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పించి వెంటనే గృహప్రవేశాలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిడ్కో లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న కసిరెడ్డి సత్యనారాయణను ఆయన అభినందించారు.
కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా టిడ్కో లబ్ధిదారుల హక్కుల సాధన కోసం అనేక ఆందోళనలు చేపట్టినట్లు తెలిపారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా పేదల సంక్షేమమే లక్ష్యంగా ఉద్యమం కొనసాగిస్తున్నామని చెప్పారు. గాజువాక మండలంలోని టిడ్కో గృహాలన్నింటినీ అన్ని సదుపాయాలతో లబ్ధిదారులకు అందించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఇప్పటికే దువ్వాడ ప్రాంతంలో కొంతమంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించామని, మిగిలిన వారికి కూడా త్వరలో అందేలా చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యుత్ కనెక్షన్ డిపాజిట్‌ను రూ.450కు తగ్గించేలా అధికారులను ఒప్పించామని, తాగునీరు, ట్రాన్స్‌ఫార్మర్లు, మురుగునీటి వ్యవస్థ, పార్కు, పాఠశాల, పోలీస్ అవుట్‌పోస్ట్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం అధికారులతో చర్చలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
సమస్యలన్నీ త్వరలో పరిష్కారమవుతాయని, లబ్ధిదారుల పక్షాన సీపీఐ అండగా నిలిచి చివరి వరకు పోరాటం కొనసాగిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
సభలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు, టిడ్కో లబ్ధిదారులు కసిరెడ్డి సత్యనారాయణ చేపట్టిన ఉద్యమాన్ని అభినందిస్తూ, ఆయన పోరాటం వల్ల తమ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు.

