– ప్రభుత్వం వేగంగా స్పందించాలని – కేకే రాజు డిమాండ్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జూలై 5: విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కోరారు.సాంకేతిక కారణాలతో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు తిరిగి రాకపోవడం, వారితో సంబంధాలు పూర్తిగా తెగిపోవడం అత్యంత ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నందున ప్రభుత్వం అత్యవసరంగా స్పందించి గాలింపు చర్యలను మరింత విస్తృతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కోస్ట్ గార్డు, నేవీ, మెరైన్ పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైతే అదనపు నౌకలు, హెలికాప్టర్లను వినియోగించి మత్స్యకారులను గుర్తించి సురక్షితంగా రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. అలాగే గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ధైర్యం చెప్పడంతో పాటు, గాలింపు చర్యల పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కేకే రాజు స్పష్టం చేశారు.

