పోస్టాఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచన
గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, ఆగస్టు 2:
పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామంలో పీసా గ్రామసభ ఉపాధ్యక్షుడు కోటం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు పోస్టల్ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) అప్పలకొండ భారత తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ సేవలను ప్రజలకు వివరించారు. పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ), సుకన్య సమృద్ధి యోజన, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, స్పీడ్ పోస్ట్, మనీ ఆర్డర్, ఆధార్ సంబంధిత సేవలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) సేవలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ప్రతి కుటుంబం కనీసం ఒక పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాను ప్రారంభించాలని, పోస్టాఫీస్ ద్వారా అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ఆర్థిక సేవలను సద్వినియోగం చేసుకోవాలని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అప్పలకొండ సూచించారు.
ఈ సందర్భంగా పీసా గ్రామసభ ఉపాధ్యక్షుడు కోటం వెంకటేశ్వరావు మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు నాణ్యమైన పోస్టల్, బ్యాంకింగ్ సేవలు గ్రామంలోనే అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ పోస్టాఫీస్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. పోస్టాఫీస్ సేవల వినియోగం ద్వారా సురక్షితమైన పొదుపు, ఆర్థిక భద్రతతో పాటు ప్రభుత్వ సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

