విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన
స్లాబ్ పెచ్చులు ఊడిపడడంతో నిరసన..
తాత్కాలికంగా డ్వాక్రా షెడ్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయం
గంగవరం, పెన్ పవర్, జూలై 31:
పోలవరం జిల్లా గంగవరం మండలం దొరమామిడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పాఠశాల భవనం స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడి తరగతి గదుల్లోకి పడుతుండటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో శుక్రవా.రం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. పిల్లల ప్రాణాలకు ముప్పు ఉన్న భవనంలో తరగతులు నిర్వహించడం సరికాదని, వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. భవనానికి శాశ్వత పరిష్కారం చూపే వరకు తమ పిల్లలను పాఠశాలకు పంపబోమని స్పష్టం చేశారు.

సమాచారం అందుకున్న ఎంపీటీసీ ఆదినారాయణ, పీసా ఉపాధ్యక్షులు మడకం రామారావు, విద్యా కమిటీ చైర్‌పర్సన్ పల్లవి, వైస్ చైర్‌పర్సన్ సరస్వతి తదితరులు ఘటనాస్థలికి చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.తాత్కాలికంగా గ్రామంలోని డ్వాక్రా మహిళా సంఘం షెడ్లో పాఠశాల తరగతులను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే పాఠశాలకు కొత్త భవనం మంజూరు చేసి నిర్మాణం చేపట్టే అంశాన్ని సోమవారం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రమాదకర స్థితిలో ఉన్న పాఠశాల భవనాన్ని వెంటనే తొలగించి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో విద్యాభ్యాసం కల్పించేందుకు అధికారులు అత్యవసర చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

