దక్షిణంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 14: స్వాతంత్ర్య దినోత్సవ ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని జాతీయ జెండాతో దేశభక్తి స్ఫూర్తిని చాటారు.
జీవీఎంసీ గాంధీ బొమ్మ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఎమ్మెల్యే బైక్ ర్యాలీని ప్రారంభించారు. గాంధీ బొమ్మ జంక్షన్ నుంచి డాబా గార్డెన్స్, జగదాంబ జంక్షన్ మీదుగా టర్నర్ చౌట్రీ వరకు ర్యాలీ సాగింది. పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, జీవీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించడం, వారి త్యాగాలను స్మరించుకోవడం, దేశభక్తి భావనను పెంపొందించడం, జాతీయ ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేయడం లక్ష్యమన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు, సిబ్బంది, పార్టీ కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.

