గార్ల, పెన్ పవర్, ఆగస్టు 14:
ఎనిమిదవ వార్డు తో పాటు గ్రామంలో మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పారిశుధ్యం, బస్సు సౌకర్యం తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బీజేపీ వార్డు సభ్యురాలు భారతి ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతిపత్రం అందజేశారు. వార్డులో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, డ్రైనేజీలు నిర్మించాలని దంపకం బజార్ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త బోరు ఏర్పాటు చేయాలని, స్మశానవాటికలో పనిచేయని బోరును మరమ్మతు చేసి నీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు తాగునీరు అందిస్తున్న ఫిల్టర్ బెడ్‌ను పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని కోరారు.అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు పనిచేయని దీపాలను మరమ్మతు చేయాలని, వర్షాకాలంలో మురుగునీరు నిల్వ ఉండకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు. దోమల నివారణకు ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, గ్రామంలో పేరుకుపోయిన చెత్తను ప్రతిరోజూ తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సొంత ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, చుట్టుపక్కల గ్రామాలకు అవసరమైన బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.ప్రజల రోజువారీ జీవనానికి సంబంధించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించాలని భారతి కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య సమస్యలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో బిజెపి నాయకులు దేవా తదితరులు ఉన్నారు.

