8 తులాల బంగారం 15 వేల నగదు అపహరణ
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 28:
ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చేసుకున్న గుర్తుతెలియని దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన గార్ల మండలంలోని ముల్కనూరు గ్రామంలో చోటుచేసుకుంది. అదె గ్రామానికి చెందిన సిద్ధబోయిన జోగయ్య ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దుండగులు అర్ధరాత్రి సమయంలో ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి ఇంట్లోని బీరువాను తెరిచి అందులో భద్రపరిచిన సుమారు 8 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.15 వేల నగదును అపహరించారు. చోరీ అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి లోపల పరిశీలించగా బీరువాలోని బంగారం, నగదు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై సాయికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

