Homeఆంధ్రప్రదేశ్కాకినాడఆర్గానిక్ అగరబత్తులతో మహిళల స్వయం ఉపాధికి కొత్త బాట

ఆర్గానిక్ అగరబత్తులతో మహిళల స్వయం ఉపాధికి కొత్త బాట

గొల్లపాలెంలో శిక్షణ కేంద్రం.. తయారీతో పాటు మార్కెటింగ్‌పై ప్రత్యేక శిక్షణ

స్థానిక ఉత్పత్తులకు స్థానిక మార్కెట్‌..

500 నుంచి 1000 మంది మహిళలకు శిక్షణ లక్ష్యం

కాజులూరు, పెన్‌పవర్‌, సెప్టెంబర్‌ 22:
మహిళల చేతుల్లో తయారయ్యే ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పిస్తే వారు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకోగలరనే ఆలోచనతో గొల్లపాలెంలో ఆర్గానిక్‌ అగరబత్తుల తయారీకి శ్రీకారం చుట్టారు. కుటీర పరిశ్రమగా అగరబత్తుల తయారీని అభివృద్ధి చేసి, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు స్థానికంగా తయారైన ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు.
గొల్లపాలెం సొసైటీ భవనంలో ఏఎంసీ డైరెక్టర్‌ సలాది పుష్పవతి ఆధ్వర్యంలో యూనియన్‌ బ్యాంక్‌ సహకారంతో మహిళలకు అగరబత్తుల తయారీలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. కేవలం తయారీ ప్రక్రియకే పరిమితం కాకుండా ఉత్పత్తులను మార్కెట్‌లో ఎలా విక్రయించాలి? వినియోగదారులను ఎలా ఆకట్టుకోవాలి? విక్రయాల్లో పాటించాల్సిన మెళకువలు ఏమిటి? అనే అంశాలపై కూడా శిక్షణ ఇస్తున్నారు.
ప్రకృతిసిద్ధమైన ముడిసరుకులతో తయారీ
ఆవుపేడ, గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు తదితర సహజ పదార్థాలను వినియోగించి సాంబ్రాణి, అగరబత్తులను తయారు చేస్తున్నారు.

వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన, సహజసిద్ధమైన ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానికంగానే నాణ్యమైన అగరబత్తులను తయారు చేసి, వాటికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని భావిస్తున్నారు.
ఇప్పటికే సుమారు 2 వేల అగరబత్తుల ప్యాకెట్లు, సాంబ్రాణి ప్యాకెట్లు విక్రయాలకు సిద్ధంగా ఉన్నట్లు యూనియన్‌ బ్యాంక్‌ ట్రైనర్‌ శంకర్రావు తెలిపారు. తయారైన ఉత్పత్తులను స్థానిక దుకాణాల్లో విక్రయించేలా వ్యాపారవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని శిక్షణలో సూచిస్తున్నారు.
తయారీతో ఆగకుండా.. మార్కెటింగ్‌పై దృష్టి
అగరబత్తులు తయారు చేయడం ఒక దశ మాత్రమేనని, వాటిని మార్కెట్‌లోకి తీసుకెళ్లడం ద్వారా మహిళలకు వాస్తవమైన ఆదాయ మార్గం ఏర్పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంచడంతో పాటు మహిళలకు లాభదాయకంగా ఉండేలా ఉత్పత్తి, ప్యాకేజింగ్‌, విక్రయ విధానాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
గొల్లపాలెంలో ప్రారంభమైన ఈ శిక్షణ కేంద్రాన్ని ఒక నమూనాగా తీసుకుని మండలంలోని ఇతర గ్రామాల మహిళలకు కూడా శిక్షణ అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. విడతల వారీగా 500 నుంచి 1000 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏఎంసీ డైరెక్టర్‌ సలాది పుష్ప తెలిపారు.
‘లోకల్‌ ప్రొడక్ట్‌’కు లోకల్‌ మార్కెట్‌
గొల్లపాలెంలో తయారయ్యే ఆర్గానిక్‌ అగరబత్తులు, సాంబ్రాణిని ముందుగా కాజులూరు మండలంలోని దుకాణాల్లో విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం సమీప ప్రాంతాలకు మార్కెట్‌ను విస్తరించాలనే ఆలోచనతో ఉన్నారు. స్థానిక మహిళల చేతుల్లో తయారైన ఉత్పత్తులు స్థానిక మార్కెట్‌లోనే అందుబాటులోకి వస్తే ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ఇద్దరికీ ప్రయోజనం కలుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
మార్కెటింగ్‌ రంగంలో మరింత ముందుకు వెళ్లేందుకు డీఆర్‌డీఏ, ఎస్సీ కార్పొరేషన్‌, బీసీ కార్పొరేషన్‌ తదితర సంస్థల ద్వారా రుణ సదుపాయాలు అందితే మహిళలు చిన్నస్థాయి నుంచి పరిశ్రమల స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని సలాది పుష్ప పేర్కొన్నారు.
ప్రతి ఇంటా ఒక కుటీర పరిశ్రమ
మహిళలు తయారీదారులుగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఒక మహిళకు శిక్షణ ఇచ్చి ఆమెను స్వయం ఉపాధి దిశగా నడిపితే, భవిష్యత్తులో మరికొందరికి ఆమె ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఇంటా ఒక చిన్న కుటీర పరిశ్రమ ఏర్పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుంది.
మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఆదేశాల మేరకు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన సహకారం అందిస్తామని కూటమి యువ నాయకులు చందాల మల్లిబాబు తెలిపారు. ఎంఎస్‌ఎంఈ కార్యక్రమాల ద్వారా మహిళలకు రుణ సదుపాయాలు కల్పించే అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
అగరబత్తుల తయారీ పెద్ద కష్టమేమీ కాదని, శిక్షణ పొందిన తరువాత తామే తయారు చేసుకోగలుగుతున్నామని శిక్షణ పొందుతున్న మహిళలు స్పందన (కాజులూరు), ఒగ్గు సుకన్య (గొల్లపాలెం), తాపాడ దేవి (కాజులూరు) తదితరులు తెలిపారు. ముడిసరుకు అందుబాటులోకి వస్తే ఇంటి వద్దే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండటంతో ఈ శిక్షణ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో గొల్లపాలెం సొసైటీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు నక్క శ్రీను, మల్లిబాబు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular