అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. వైసీపీ నేతలు సిద్ధమా?: కూటమి నేతలు
రామచంద్రపురం, పెన్ పవర్,సెప్టెంబర్ 21: దేవాలయ అంశాలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం మానుకోవాలని, మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని కూటమి పార్టీ నాయకులు స్పష్టం చేశారు. రామచంద్రపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంతరాయ్, జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, క్లస్టర్-2 ఇన్‌చార్జి కంచుమర్తి బాబురావు, అమలాపురం పార్లమెంటు అధికార ప్రతినిధి సిర్రా సురేష్, సీనియర్ నేత రవ్వా భూషణం మాట్లాడారు.ద్రాక్షారామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ అంశాన్ని వైసీపీ నాయకులు రాజకీయ వివాదంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కూటమి నేతలు విమర్శించారు. ఆలయానికి సంబంధించిన పరిపాలనా, చట్టపరమైన అంశాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉంటాయని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను, చట్టపరమైన ప్రక్రియను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.మంత్రి సుభాష్ ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించి పనిచేస్తున్నారని కూటమి నేతలు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడే అంశం లేక ఆలయ వ్యవహారాన్ని రాజకీయ అంశంగా తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఎన్ని రాజకీయ విమర్శలు వచ్చినా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పిల్లి సూర్యప్రకాష్ తదితరులు మంత్రి సుభాష్‌పై చేస్తున్న విమర్శలకు కూటమి నేతలు స్పందిస్తూ.. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడాలని సూచించారు. రాజకీయ వారసత్వంతో వచ్చిన గుర్తింపుతో పాటు ప్రజా జీవితంలో వ్యక్తిగతంగా ప్రజలతో మమేకమై పనిచేసిన అనుభవం కూడా అవసరమని వ్యాఖ్యానించారు.
మీడియా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులను గౌరవించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందన్నారు. సంబంధిత నాయకులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మీడియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వైసీపీ నేతలకు చర్చించాలనే ఆసక్తి ఉంటే తాము సిద్ధంగా ఉన్నామని కూటమి నేతలు తెలిపారు. గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులపై వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు సిద్ధమన్నారు.డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను రాజకీయ విమర్శల్లోకి తీసుకురావడం సరికాదని అన్నారు. ఉద్యోగ నియామకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిని రాజకీయ వివాదాల్లోకి లాగకుండా ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు.స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ విమర్శలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత ఆరోపణలకు బదులుగా అభివృద్ధి, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగాలని కూటమి నేతలు పేర్కొన్నారు. మంత్రి సుభాష్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

