యువత అత్యుత్సాహానికి దూరంగా ఉండాలి.. భద్రతా నిబంధనలు పాటించాలి
: ఎస్పీ బిందు మాధవ్
కాకినాడ జిల్లా, పెన్పవర్ ప్రతినిధి, సెప్టెంబర్ 22: తుఫాను ప్రభావం నేపథ్యంలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా యువత, ఉత్సవ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ సూచించారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో జిల్లాలో నిర్వహించే గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను సాయంత్రం చీకటి పడకముందే పూర్తి చేసుకోవాలని కోరారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిమజ్జనాలను ముందుగానే ప్రారంభించి, ఎలాంటి ఆలస్యం లేకుండా ముగించుకోవాలని సూచించారు.యువత నిమజ్జన ఊరేగింపుల్లో అత్యుత్సాహానికి దూరంగా ఉండాలని, ప్రమాదకరంగా వాహనాలు నడపడం, ఈత రాని వారు నీటిలోకి వెళ్లడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉత్సవ కమిటీలు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని ఎస్పీ కోరారు.నిమజ్జన ఘాట్ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ప్రజలు, యువత పోలీసులకు సహకరించి గణేశ్ నిమజ్జనాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని ఎస్పీ బిందు మాధవ్ విజ్ఞప్తి చేశారు.

