అధిష్ఠాన నిర్ణయాలను పాటిస్తూ కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి
నాయకులు–కార్యకర్తల మధ్య సత్సంబంధాలు అవసరం
ప్రజాక్షేత్రంలో నిరంతరం పనిచేయాలి
నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో జోనల్ కో–ఆర్డినేటర్ అరిమిల్లి రాధాకృష్ణ
గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, సెప్టెంబర్ 22:
పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని జోనల్ కో–ఆర్డినేటర్ అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తూ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను అందరూ సమష్టిగా అమలు చేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు నిత్యం ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. రంపచోడవరం ఆర్.పి. ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆధ్వర్యంలో మంగళవారం నియోజకవర్గ పార్టీ అత్యవసర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అరిమిల్లి రాధాకృష్ణకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం అవసరం
నియోజకవర్గ స్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించాలంటే నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఎంతో అవసరమని అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. స్థానిక సమస్యలపై నాయకులు, కార్యకర్తలు క్షుణ్ణమైన అవగాహన కలిగి ఉండాలని, వాటిని ఎప్పటికప్పుడు సంబంధిత నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ఎవరు ఎంత క్రియాశీలకంగా పనిచేస్తున్నారనే అంశంపై పార్టీ దృష్టి ఉంటుందని తెలిపారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి నియోజకవర్గ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.
కార్యకర్తలదే కీలక బాధ్యత: ఎమ్మెల్యే శిరీషాదేవి
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ప్రత్యేక బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. కార్యకర్తల కోసం తనవంతుగా చేయాల్సిన సహాయాన్ని చేశానని, ఇంకా ఏ విధమైన సహకారం అవసరమో తెలియజేస్తే సాధ్యమైన మేరకు అందిస్తానని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ ఆదేశాలతో పాటు కార్యకర్తల అభీష్టానికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రాయితీలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వివరించేలా ఇంటింటి ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు.
అధిష్ఠాన ఆదేశాల మేరకు ముందుకు సాగాలి
అధిష్ఠాన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కోట్ని బాలాజీ, స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు కుడుపూడి సత్తిబాబు సూచించారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, పార్టీ ఎవరికి అభ్యర్థిత్వం కల్పించినా వారిని సమష్టిగా గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు పార్టీ శ్రేణులకు కీలకమైనవని, గ్రామస్థాయి నుంచి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
కూటమి ధర్మాన్ని పాటించాలి
మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబురమేష్, వంతల రాజేశ్వరి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి పొత్తుకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి పార్టీ శ్రేణులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల కోసం సమష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు.
పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం
సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత, ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ సభ్యులు షేక్ సుభానీ, అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మోజోరు తేజోవతి, ఉపాధ్యక్షులు దంతులూరి శివరామచంద్రరాజు, ఏఎంసీ చైర్మన్ లోతా లక్ష్మణరావు తదితరులు మాట్లాడారు. పార్టీ సంస్థాగత బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, గ్రామస్థాయిలో ప్రజలతో సంబంధాల పెంపు, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెంటపాటి అనంతమోహన్, గురుకు శేషుకుమార్, జర్తా వెంకటరమణరెడ్డి, పొత్తూరి కాంతారెడ్డి, జమాల్ఖాన్, ఎడవల్లి భాస్కరరావు, బొర్రా నరేష్కుమార్, బి.పుల్లయ్య, పల్లాల వెంకటరెడ్డి, గోళ్ల చంటిబాబు, వాళ్ల రంగారెడ్డి, నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షుడు పండా బాపన్నదొర బాబీ, సొసైటీ అధ్యక్షులు పాము అర్జున్, ముప్పన కేశవ్, రాజేష్, టీడీపీ సీనియర్ నాయకులు అడబాల బాపిరాజు, గణజల తాతారావు, గొర్లె శ్రీకాంత్, కరక వెంకటరమణ, కనిగిరి రాంబాబు, సీతపల్లి దేవస్థానం ధార్మిక మండలి చైర్మన్ బాపన్నదొర, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ముప్పన సావిత్రి, మాజీ సర్పంచ్ వై.నిరంజనీదేవి, ఏఎంసీ డైరెక్టర్ గట్టి మాణిక్యం, మువ్వ శ్రీను, క్లస్టర్ ఇన్చార్జి కారం సింహాచలం, పార్టీ అనుబంధ కమిటీల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

