**200 మందికి వైద్య సేవలు.. అవసరమైన వారికి ఉచితంగా పరీక్షలు, మందుల పంపిణీ**
గంగవరం/ రంపచోడవరం పెన్ పవర్ నవంబర్ 8:
రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో ఆదివారం (నవంబర్ 8) రంపచోడవరం మండలం సిరిగిందలపాడులోని రామకృష్ణ మిషన్ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మందికి వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ తెలిపారు.
ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రాయుడు శ్రీనివాస్, దాసరి ఉమామహేశ్, డాక్టర్ వెలమ స్నేహ మాధురి పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారిలో 53 మందికి రక్త పరీక్షలు, నలుగురికి ఈసీజీ, ఎనిమిది మందికి థైరాయిడ్ పరీక్షలు, ఏడుగురికి ఎక్స్రేలు, 20 మందికి ఫిజియోథెరపీ సేవలు అందించారు.
జీబీఆర్ ట్రస్ట్, బాపట్లకు చెందిన డాక్టర్ గోపాలం శివన్నారాయణ బృందం ఆధ్వర్యంలో 44 మంది రోగులకు నాలుగు నెలలకు సరిపడా మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జీబీఆర్ ట్రస్ట్ వాలంటీర్, ఉపాధ్యాయుడు బల్లెం సాయిరాజ్ రోగులకు మూర్ఛ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ చర్యలు, ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
వైద్య శిబిరానికి వచ్చిన రోగులు, వారి సహాయకులకు రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించినట్లు స్వామీజీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ వైద్య శిబిరం సమన్వయకర్త కానుమోలు శ్రీనివాస్, సిబ్బంది, వాలంటీర్లు గిరిరాజ్ కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

