రాత్రి 9 గంటల నుంచి మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లపై ఆంక్షలు
రంపచోడవరం, (పోలవరం బ్యూరో )పెన్ పవర్, అక్టోబర్ 27:
పోలవరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా మంగళవారం రాత్రి 9 గంటల నుంచి మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో రాత్రి వేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ఘాట్ రోడ్లపై ప్రయాణించేందుకు ప్రయత్నించవద్దని కోరారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రజలు, వాహనదారులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, విపత్తుల సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కె. దినేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

