ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలి: కలెక్టర్ కె. దినేష్ కుమార్
రంపచోడవరం, నవంబర్ 3: పోలవరం జిల్లాలో నవంబర్ 5వ తేదీన నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5న పోలింగ్ జరగనుందని పేర్కొన్నారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం–1881, ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం–1988 నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగులు, కార్మికులు ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు సహకరించాలని కోరారు.

