కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు–అధికారుల మధ్య సమన్వయం లోపం ఇప్పుడు అధికార పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది.అధికారులపై ఒత్తిడి, పోస్టింగ్‌ల విషయంలో జోక్యం, పోలీస్ కార్యాలయాల ముందు నిరసనలు పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ పాఠాలు చెప్పడమే కాకుండా మెడిటేషన్ మంత్రం జపిస్తున్నారు. అహంకారం తగ్గించి సేవా దృక్పథంతో పనిచేయాలని స్పష్టమైన సందేశం పంపారు. మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు కూడా హైకమాండ్ నుంచి వస్తున్నాయి.
ఎమ్మెల్యేలు–అధికారుల మధ్య పెరుగుతున్న గ్యాప్
పోస్టింగ్‌ల రాజకీయంపై హైకమాండ్ అసహనం
మెడిటేషన్, యోగాతో ఎమ్మెల్యేల మైండ్‌సెట్ మార్చే ప్లాన్
ధర్నాలు, ఒత్తిళ్లపై సీఎం సీరియస్ వార్నింగ్
బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే కఠిన చర్యలు
దారికి తెచ్చే పనిలో సీఎం
గుంటూరు | పెన్ పవర్ | ఏప్రిల్ 3:
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల మధ్య సమన్వయం లోపం స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. తాము సూచించిన పనులు వెంటనే జరగడం లేదని, అధికారుల నుంచి తగిన గౌరవం లభించడం లేదని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఎస్పీ కార్యాలయంలో గంటల పాటు నిరసన చేపట్టడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ తరహా సంఘటనలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు బహిరంగంగా హెచ్చరిక జారీ చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రజా ప్రతినిధులుగా బాధ్యతతో వ్యవహరించాలని సీఎం సూచించారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్, యోగా, మానసిక వికాస శిక్షణలు కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అధికారులకు, మంత్రులకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవాన్ని ఇప్పుడు ఎమ్మెల్యేలపై అమలు చేయాలని భావిస్తున్నారు. “గెలిచాం కాబట్టి మేమే కింగ్స్” అన్న భావనతో కాకుండా, సేవా దృక్పథంతో ప్రజల మధ్య ఉండాలని, అధికారులతో ఘర్షణలు కాకుండా సమన్వయంతో పనిచేయాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఒకవేళ హెచ్చరికల తర్వాత కూడా తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

