ePaper
Saturday, April 4, 2026
ePaper
Homeతాజా సమాచారంహిందుత్వ ముద్ర కోసం భూమన ఆరాటం

హిందుత్వ ముద్ర కోసం భూమన ఆరాటం

తిరుపతి రాజకీయాల్లో భూమన కరుణాకర్ రెడ్డి అడుగులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తనపై ఉన్న “హిందూ వ్యతిరేకి” విమర్శలకు చెక్ పెట్టేలా మత పునఃస్వీకరణ కార్యక్రమానికి స్వయంగా ముందుండటం హాట్ టాపిక్ అయింది.ముస్లిం దంపతులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం ద్వారా భూమన రాజకీయంగా కొత్త సంకేతాలు ఇచ్చారన్న విశ్లేషణ వినిపిస్తోంది.టీటీడీ మాజీ చైర్మన్‌గా తీసుకున్న హిందూ ధార్మిక నిర్ణయాలకు ఇది కొనసాగింపుగా చూస్తున్నారు.అయితే ఇది నిజమైన ధార్మిక చొరవా.. లేక డ్యామేజ్ కంట్రోలా అన్నదే ఇప్పుడు రాజకీయ చర్చ.

  • భూమనపై ‘హిందూ వ్యతిరేకి’ ముద్ర చెరిపే ప్రయత్నమా?
  • ముస్లిం దంపతుల మత పునఃస్వీకరణతో తిరుపతిలో హీట్
  • టీటీడీ మాజీ చైర్మన్ అడుగులపై రాజకీయ విశ్లేషణ
  • లడ్డూ, నెయ్యి వివాదం మధ్య కొత్త ధార్మిక సంకేతాలు
  • వైసీపీ డ్యామేజ్ కంట్రోల్‌లో భాగమేనా అన్న చర్చ

తిరుపతి | పెన్ పవర్ | ఏప్రిల్ 3:

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో రాజకీయ పరిణామాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా ఒక ముస్లిం దంపతుల మత పునఃస్వీకరణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తూ ఇస్లాం మతాన్ని స్వీకరించిన తిరుపతికి చెందిన ఓ దంపతులు, ఇటీవల భూమన చొరవతో తిరిగి హిందూ మతాన్ని స్వీకరించినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం జరగడం విశేషంగా మారింది. టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో హిందూ ధర్మ పరిరక్షణ, ఇతర మతాల నుంచి తిరిగి హిందూ మతంలోకి రావాలనుకునే వారికి తిరుమల వేదిక కావాలని భూమన తీసుకున్న నిర్ణయాలు అప్పట్లోనూ చర్చకు వచ్చాయి. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత స్థాయిలో అదే తరహా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయంగా కొత్త సందేశంగా మారింది. అయితే, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదం, టీటీడీ చుట్టూ నెలకొన్న సున్నిత పరిస్థితుల్లో ఈ తరహా మత పునఃస్వీకరణ కార్యక్రమాలు చేపట్టడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయా అనే చర్చ కూడా సాగుతోంది. వైసీపీపై పడిన “హిందూ వ్యతిరేక” ముద్రను తగ్గించుకునే ప్రయత్నంగా దీనిని ప్రత్యర్థులు అభివర్ణిస్తుండగా, భూమన అనుచరులు మాత్రం దీనిని ధార్మిక సేవగా చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular