అమరావతి రాజకీయాలపై మరోసారి వేడి పెరిగింది. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన “మావిగన్” వ్యూహం రాజధాని చర్చను కొత్త కోణంలో నిలబెట్టింది. భావోద్వేగాల కంటే ప్రజలకు చేరువైన పరిపాలన అవసరమనే అంశం ముందుకు వచ్చింది. వికేంద్రీకరణే అభివృద్ధికి బాట అని వైసీపీ వాదన మళ్లీ బలపడుతోంది.ఈ వ్యూహం అధికార కూటమికి రాజకీయంగా కఠిన పరీక్షగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
- “మావిగన్”… వైసీపీ ప్లాన్-Bతో కొత్త రాజధాని చర్చ
- మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్‌పై జగన్ మాస్టర్ స్కెచ్
- జగన్ మాస్టర్ స్కెచ్ తో కూటమి నేతల్లో గుబులు – పైకి సంబరాలు జరుపుకుంటున్న లోలోపల డీలపడుతున్న కూటమి
- “మావిగన్”తో జగన్ కొత్త రాజకీయ దిశ – అమరావతి చర్చకు వైసీపీ కొత్త అర్థం
- భావోద్వేగాల కంటే ప్రజల అవసరాలే ముఖ్యం – వికేంద్రీకరణతో సమతుల అభివృద్ధి లక్ష్యం
- రాజధాని అంటే ప్రజలకు చేరువైన పాలన – కోస్తా ప్రాంతాల్లో వైసీపీ వాదనకు మద్దతు
- కూటమిని ఇరుకున పెట్టే జగన్ వ్యూహం -అభివృద్ధి ఫలితాలపైనే ప్రజల దృష్టి
- రాష్ట్రవ్యాప్తంగా సమాన అవకాశాలే అసలు ఎజెండా – రాబోయే రాజకీయ సమీకరణాలకు “మావిగన్” కీ ఫ్యాక్టర్
స్టేట్ పొలిటికల్ బ్యూరో | పెన్ పవర్ | విజయవాడ | ఏప్రిల్ 03
ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజకీయాల్లో మరోసారి కొత్త చర్చ మొదలైంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న “మావిగన్” ప్లాన్-B ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మచిలీపట్నం + విజయవాడ + గుంటూరు ప్రాంతాలను కలిపి సమగ్ర రాజధాని కారిడార్‌గా అభివృద్ధి చేయాలన్నదే ఈ వ్యూహం సారాంశం. ప్రాంతీయ సమతుల్యత, వేగవంతమైన కనెక్టివిటీ, పెట్టుబడుల వికేంద్రీకరణ లక్ష్యంగా ఈ మోడల్‌పై చర్చ జరుగుతోంది. ఇది నిజంగా అమరావతికి ప్రత్యామ్నాయమా? లేక కోస్తా ఆంధ్ర భవిష్యత్ ఆర్థిక బ్లూప్రింట్‌గా మారుతుందా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
మావిగన్ అంటే ఏమిటి?
“మావిగన్” అనే పేరులోనే వ్యూహం దాగి ఉంది. మచిలీపట్నం + విజయవాడ + గుంటూరు = మావిగన్ ఈ మూడు కీలక నగరాలను ఒకే మెగా క్యాపిటల్–ఎకనామిక్ రీజియన్‌గా తీర్చిదిద్దాలన్నదే వైసీపీ ప్లాన్-Bగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకే నగరంపై పరిపాలనా, ఆర్థిక, మౌలిక సదుపాయాల ఒత్తిడి కాకుండా, మూడు నగరాల బలాలను ఒకే కారిడార్‌గా మలచడం ఈ ఆలోచనలో ప్రధాన అంశం.
మచిలీపట్నం – ఆర్థిక ద్వారం :
మచిలీపట్నం ఈ మోడల్‌లో కీలక కేంద్రంగా కనిపిస్తోంది. పోర్ట్, ఎగుమతులు, సముద్ర వాణిజ్యం, ఇండస్ట్రియల్ కారిడార్ అవకాశాలతో మచిలీపట్నాన్ని ఆర్థిక ఇంజిన్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉంది. పోర్ట్ ఆధారిత అభివృద్ధి ద్వారా విదేశీ పెట్టుబడులు, లాజిస్టిక్స్, తయారీ రంగాలకు భారీ ఊతం లభిస్తుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.
విజయవాడ – పరిపాలనా హబ్ :
విజయవాడ ఇప్పటికే రవాణా, రైల్వే, జాతీయ రహదారి కనెక్టివిటీలో రాష్ట్రానికి గుండెకాయలా ఉంది. అందుకే “మావిగన్”లో విజయవాడను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ జోన్‌గా మలచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. సచివాలయం, కీలక శాఖలు, పరిపాలనా భవనాలు ఇక్కడే కేంద్రీకృతమైతే ప్రజలకు చేరువైన పాలన సాధ్యమవుతుందనే వాదన బలపడుతోంది.
గుంటూరు – విద్యా, న్యాయ, సంస్థాగత శక్తి :
గుంటూరు ను ఈ కారిడార్‌లో ఎడ్యుకేషన్, హెల్త్, జ్యుడీషియల్ & ఇన్‌స్టిట్యూషనల్ జోన్‌గా అభివృద్ధి చేయొచ్చనే విశ్లేషణ ఉంది. యూనివర్సిటీలు, హెల్త్ సూపర్ స్పెషాలిటీలు, న్యాయ వ్యవస్థ, నాలెడ్జ్ హబ్‌లను గుంటూరులో కేంద్రీకరించడం ద్వారా సమతుల అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
అమరావతికి ప్రత్యామ్నాయమా?
అమరావతి పై భావోద్వేగం కొనసాగుతూనే ఉన్నా, వైసీపీ ఇప్పుడు ఒకే నగర రాజధాని కంటే ప్రాంతీయ రాజధాని కారిడార్ మోడల్‌ను ముందుకు తెస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయ వ్యూహమే కాకుండా, భవిష్యత్ పట్టణీకరణ, పెట్టుబడులు, ఉపాధి, మౌలిక వసతుల విస్తరణకు కూడా ఉపయోగపడే దీర్ఘకాలిక మోడల్‌గా చెప్పొచ్చు.
జగన్ మాస్టర్ స్కెచ్‌గా మారుతుందా? :
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో వికేంద్రీకరణను ప్రధాన అజెండాగా ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు “మావిగన్” ఆలోచన అదే సిద్ధాంతానికి కొత్త రూపంగా కనిపిస్తోంది. ప్రజలకు దగ్గరగా పరిపాలన, మూడు నగరాల సమిష్టి అభివృద్ధి, పోర్ట్–రోడ్–రైలు కనెక్టివిటీ బలం కలిస్తే ఇది నిజంగా జగన్ మాస్టర్ ప్లాన్గా నిలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. “ఒకే అమరావతి కాదు… మావిగన్ కారిడార్‌నే కోస్తా ఆంధ్ర భవిష్యత్ రాజధానిగా మలచాలన్నదే వైసీపీ ప్లాన్-B” ఈ లైన్ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. రాజధాని అంటే భవనాలు, రోడ్లు, టవర్లు మాత్రమే కాదు… ప్రజలకు సులభంగా అందే పాలన, అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కూడా కావాలని వైసీపీ చెబుతోంది. ప్రత్యేకంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వికేంద్రీకరణపై సానుకూల చర్చ పెరుగుతోంది. ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అడుగుతున్న ప్రశ్న — రాజధాని పేరు కాదు, ఫలితాలు ఎక్కడ? ఇదే ప్రశ్న వైసీపీ వ్యూహానికి బలంగా మారుతోంది. అధికార కూటమి అమరావతి భావోద్వేగాన్ని ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తుంటే, జగన్ మాత్రం పరిపాలన ప్రజలకు ఎంత చేరువలో ఉంది? అనే అసలు ప్రశ్నను ముందుకు తెస్తున్నారు. ఈ రాజకీయ నారేటివ్ మార్పు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చివరికి “మావిగన్” వ్యూహం కేవలం రాజకీయ ప్రయోగం కాదు… వైసీపీ మళ్లీ ప్రజల సమస్యల చుట్టూ రాజధాని చర్చను మలచే ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రజల స్పందన కూడా ఇదే దిశగా సాగితే, ఇది నిజంగా గేమ్‌చేంజర్ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

