జగ్గంపేట, పెన్ పవర్ జూలై 03 : ఓటు హక్కు ప్రతి పౌరుడికి లభించిన అమూల్యమైన ప్రజాస్వామ్య హక్కని, దానిని వినియోగించుకోవడానికి మిగిలింది కేవలం 10 రోజులేనని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. శుక్రవారం రావులమ్మ నగర్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం)పై బీఎల్ఏల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 14తో ఓటరు నమోదు ప్రక్రియ ముగుస్తుందని, ప్రతి ఒక్కరూ ఆ తేదీని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. “క్యాలెండర్‌లో ఎర్ర సిరాతో జూలై 14ను మార్క్ చేసుకోండి. ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు” అని అన్నారు.
బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) ఇకపై బూత్ లెవల్ యాక్టివిస్టులుగా పనిచేయాలని సూచించిన ఆయన, ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించేలా కృషి చేయాలని ఆదేశించారు. “ఒక్క అర్హుడైనా మిగిలిపోకూడదు. ఇదే మీ అసలు పరీక్ష” అని పేర్కొన్నారు.ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “మీ ఓటు – మీ భవిష్యత్తు. బీఎల్ఏలు మీ ఇంటికి వచ్చినప్పుడు సహకరించండి. ఐదు నిమిషాలు సమయం కేటాయిస్తే ఐదేళ్ల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది” అని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం కోల్పోతారని, అర్హులైన ప్రతి ఒక్కరూ గడువు ముగిసేలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎస్‌వీఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండ బాబు, జగ్గంపేట సొసైటీ చైర్మన్ బుర్రి సత్తిబాబు, టౌన్ టీడీపీ అధ్యక్షుడు పాండ్రంగి రాంబాబు, క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ గెద్దాడ సత్యవేణి, బీఎల్ఏలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

