– రామచంద్రపురంలో ఉద్రిక్తత
- రామచంద్రపురం, పెన్‌పవర్, ఏప్రిల్ 6:
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు చెందిన పార్టీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తపై దాడి జరిగిందన్న ఆరోపణలు రామచంద్రపురంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శీల మాజీ గ్రామ సర్పంచ్ పంపన శ్రీను అనే వ్యక్తిని మంత్రి అనుచరులు, మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం పిలిపించి దాడి చేశారని బాధితుడు, కుటుంబ సభ్యులు సోమవారం మీడియాకు వెల్లడించారు.
బాధితుడి వాంగ్మూలం ప్రకారం, ఆదివారం సాయంత్రం గ్రామ కమిటీ నుంచి తప్పుకోవాలని మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం సూచించగా, తాను నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగింది. అనంతరం కోట తాతబ్బాయి, వల్లు అర్జునరావు అనే వ్యక్తులు మాట్లాడుదామని చెప్పి పంపన శ్రీనును మంత్రి కార్యాలయానికి తీసుకెళ్లినట్లు తెలిపారు.కార్యాలయానికి చేరుకున్న వెంటనే వాసంశెట్టి సత్యం తనపై దాడి చేశారని, అనంతరం అనుచరులు ఒక గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులు గుద్దడంతో తాను స్పృహ కోల్పోయినట్లు బాధితుడు పేర్కొన్నారు. తన కుమారుడు అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై కూడా దాడి జరిగిందని తెలిపారు.అంతేకాకుండా, తమ మొబైల్ ఫోన్లు లాక్కొని, ఫోన్‌లోని రికార్డులు తొలగించి, ముందుగానే సిద్ధం చేసిన తెల్ల పేపర్లు, బాండు పేపర్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయం బయటకు వస్తే ఆ పత్రాలు ఉపయోగిస్తామని బెదిరించారని కూడా తెలిపారు.స్పృహ తప్పిపోవడంతో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా, ఓపీ నమోదు చేయకుండా, కేసు నమోదు చేయకుండా తొందరపాటుగా చికిత్స చేసి పంపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది వైద్య విధానాలకు విరుద్ధమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా, సోమవారం మధ్యాహ్నం బాధితుడి కుమారుడిని పార్టీ కార్యాలయానికి పిలిపించి, జరిగిన విషయాన్ని మర్చిపోవాలని, సహాయం చేస్తామని చెప్పి బుజ్జగించేందుకు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పరిణామాలు పార్టీలో చర్చకు దారి తీసాయి.మరోవైపు, సాయంత్రం సమయంలో మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పోలీసులు పంపన శ్రీనును ఇంటి నుంచి తీసుకెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో బాధితుడి భార్య సత్యవేణి పోలీసులను ప్రశ్నించగా, ఆమెను పక్కకు నెట్టి శ్రీనును బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.ఈ సమాచారం అందుకున్న ప్రతిపక్ష నేత, రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పిల్లి సూర్యప్రకాశ్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాధితుడికి అండగా నిలిచారు. అనంతరం జరిగిన వివరాలను బాధితుడు వెల్లడించడంతో అక్కడి పరిస్థితి మారింది.తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని పంపన శ్రీను పోలీసులను, మీడియాను కోరారు.బాదితుని ఇంటి సమీపంలో మరో ఇద్దరు సూత్రధారులు రెక్కీ నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఘటనతో రామచంద్రపురం ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

