అమరావతిలో “మినీ ఢిల్లీ” రూపుదిద్దుకునే దిశగా భారీ అడుగు పడింది.అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే క్యాంపస్‌లోకి తీసుకురానున్న కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది.రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో 22.53 ఎకరాల్లో ఆధునిక సముదాయం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.సచివాలయం, ఉద్యోగుల నివాస సముదాయాలు, కన్వెన్షన్ సెంటర్‌తో అమరావతికి జాతీయ నగర శోభ రానుంది.ఈ ప్రాజెక్టు రాజధాని ఆర్థిక కార్యకలాపాలకు కొత్త ఊపునివ్వనుంది.
- అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్
- 22.53 ఎకరాల్లో మినీ ఢిల్లీ ప్రాజెక్టు
- రూ.2,534 కోట్ల భారీ పెట్టుబడి
- కేంద్ర ఉద్యోగుల కోసం నివాస టవర్లు
- కన్వెన్షన్ సెంటర్‌తో అంతర్జాతీయ ఆకర్షణ
విజయవాడ, పెన్ పవర్ ఏప్రిల్ 09:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉనికిని మరింత బలోపేతం చేసే కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ఢిల్లీలోని సెంట్రల్ విస్టా తరహాలో అన్ని కేంద్ర శాఖలను ఒకే సముదాయంలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో పనిచేస్తున్న 50కు పైగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఈ క్యాంపస్‌లోకి మారనున్నాయి.ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ.2,534 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో రూ.1,299.08 కోట్లు సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి, రూ.1,234.91 కోట్లు కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాలకు కేటాయించారు. ఏపీ సీఆర్‌డీఏ ఇప్పటికే 22.53 ఎకరాల భూమిని కేటాయించగా, అందులో 5.53 ఎకరాల్లో కార్యాలయ భవనం, మిగిలిన 17 ఎకరాల్లో నివాస టవర్లు నిర్మించనున్నారు.పర్యావరణ హితమైన గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ సముదాయంలో సెంట్రలైజ్డ్ ఏసీ, ఆధునిక ఐటీ మౌలిక వసతులు, విశాలమైన కాన్ఫరెన్స్ హాల్స్, పార్కింగ్ సదుపాయాలు ఉండనున్నాయి. కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షించనుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభమై, రెండేళ్లలోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే ప్రాంతంలో మరో 10 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ ప్రతిపాదన కూడా ఉండటంతో అమరావతిలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు మార్గం సుగమం కానుంది. వేలాది కేంద్ర ఉద్యోగులు, అనుబంధ సేవల రంగం రావడంతో స్థిరాస్తి, హోటల్, రిటైల్, రవాణా రంగాలకు భారీ ఊతం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో అమరావతి పరిపాలనా కేంద్రం నుంచి జాతీయ స్థాయి నగరంగా ఎదగడానికి ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలవనుంది.

