ePaper
Thursday, April 9, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితిరుపతిలో 10 అంతస్తుల మెగా బస్ టెర్మినల్..

తిరుపతిలో 10 అంతస్తుల మెగా బస్ టెర్మినల్..

తిరుపతిలో భక్తుల రద్దీకి శాశ్వత పరిష్కారంగా అత్యాధునిక 10 అంతస్తుల ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్ రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉన్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్ స్థానంలో రూ.470 కోట్లతో ఈ భారీ ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.గ్రౌండ్ ఫ్లోర్‌లో 98 ప్లాట్‌ఫామ్‌లు, పై అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు ఏర్పాటు చేయనున్నారు.పదో అంతస్తులో హెలీప్యాడ్, రైల్వే స్టేషన్‌కు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వంటి సౌకర్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.తిరుమల భక్తులకు రవాణా, వసతి, వాణిజ్య సేవలను ఒకే చోట అందించే మెగా హబ్‌గా ఇది మారనుంది.

రూ.470 కోట్లతో మెగా టెర్మినల్‌కు గ్రీన్ సిగ్నల్
గ్రౌండ్ ఫ్లోర్‌లో 98 ప్లాట్‌ఫామ్‌లు, భారీ పార్కింగ్
10 అంతస్తుల్లో హోటళ్లు, షాపులు, డార్మెటరీలు
పదో ఫ్లోర్‌లో హెలీప్యాడ్.. భక్తులకు కొత్త సౌకర్యం
రైల్వే స్టేషన్, తిరుమలకు సులభ కనెక్టివిటీ

తిరుపతి, పెన్ పవర్ ఏప్రిల్ 09:

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి చేరుకుంటుండటంతో, నగరంలో రవాణా సౌకర్యాలను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న ప్రధాన ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్ స్థానంలో ఇంటర్ మోడల్ బస్ టెర్మినల్ నిర్మించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.470 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.ఈ టెర్మినల్‌ను ఈపీసీ విధానంలో నిర్మించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మొత్తం 13.18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రస్తుత బస్టాండ్, డిపో ప్రాంతంలో 7.11 ఎకరాల్లో ప్రధాన టెర్మినల్, 4.29 ఎకరాల్లో కమర్షియల్ అభివృద్ధి చేపట్టనున్నారు. అదనంగా రోడ్లు, ఫ్లైఓవర్‌ల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.ప్రాజెక్టు ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బస్ టెర్మినల్‌కే కేటాయించి 98 ప్లాట్‌ఫామ్‌లు, అదనంగా మరో 50 బస్సుల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయనున్నారు. సెల్లార్‌లో రెండు అంతస్తుల పార్కింగ్ సదుపాయం కూడా ఉండనుంది.గ్రౌండ్ ఫ్లోర్ పైగా 10 అంతస్తుల కమర్షియల్ టవర్ నిర్మించనున్నారు. ఇందులో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, షాపులు ఏర్పాటు చేసి భక్తులకు ఒకే ప్రాంగణంలో అన్ని సౌకర్యాలు అందించనున్నారు. ముఖ్యంగా పదో అంతస్తులో హెలీప్యాడ్ ఏర్పాటు ప్రతిపాదన ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకతను తెస్తోంది. అంతేకాదు, బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్‌కు నేరుగా వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. తిరుమల, రైల్వే స్టేషన్, నగరంలోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. కమర్షియల్ విభాగం ద్వారా వచ్చే ఆదాయం, ఆర్టీసీ వాటా, ఒప్పంద కాలం వంటి అంశాలపై త్వరలో స్పష్టత రానుంది. మొత్తం మీద ఈ మెగా టెర్మినల్ తిరుపతి నగరానికి ఆధునిక మౌలిక సదుపాయాల కొత్త గుర్తింపుగా నిలవనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular