2 కిలోల గంజాయి లిక్విడ్ ఆయిల్, రెండు కిలోల గంజాయి పట్టివేత
మూడు బైకులు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం
నర్సీపట్నం, పెన్ పవర్ :
అనకాపల్లి జిల్లా గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను, రెండు కిలోల గంజాయి లిక్విడ్ ఆయిల్, రెండు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. ముందస్తు సమాచారం మేరకు గొలుగొండ మండలం ఏటిగైరంపేట శివారులో మాటు వేశారు. మూడు మోటార్ సైకిళ్ల పై వచ్చిన వ్యక్తులు, చేతి సంచుల్లో ఉన్న మాదకద్రవ్యాలను ఒకరి వాహనం నుండి మరొకరి వాహనంకు మార్చుకునే సమయంలో పట్టుకున్నారు. వి. కోటేశ్వరరావు, కర్రి ధారబాబు, గోనూరు వెంకునాయుడు, బోడుం సాయి, కాదా సంతోష్ కుమార్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్దనుండి రెండు కిలోల గంజాయి లిక్విడ్ ఆయిల్, రెండు కిలోల గంజాయి, మూడు బైకులు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీన పరుచుకున్నారు. స్వాధీనం పరుచుకున్న సొత్తు విలువ 33 లక్షలు ఉంటుందని డిఎస్పి తెలిపారు. అరెస్టు అయిన స్మగ్లర్లు ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని సేకరించి, మైదాన ప్రాంతంలో విక్రయించడం ద్వారా అక్రమార్జనకు అలవాటు పడ్డారని తెలిపారు. వీరికి ఒడిస్సాకు చెందిన బచ్చల మోహన్ అనే వ్యక్తి సహకరిస్తున్నట్లు విచారణలో తెలిసిందని, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. గంజాయి పండించినా, నిల్వచేసినా, రవాణా చేసినా చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని, అక్రమ రవాణా విక్రయాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే 112, 1972 నంబర్లకు తెలియజేయవలసిందిగా డి.ఎస్.పి శ్రీనివాసరావు మీడియా ద్వారా కోరారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ ఎల్. రేవతమ్మ, గొలుగొండ ఎస్సై పి. రామారావు, కృష్ణదేవిపేట ఎస్సై కె. రిషికేష్, నర్సీపట్నం రూరల్ ఎస్సై పి.రాజారావు మరియు ఏ ఎస్ ఐ సన్యాసిరావు, కానిస్టేబుళ్ళు వాసు, టి. వెంకటేష్, చిన్నారావు, హోంగార్డులు శ్రీను, భాను పాల్గొన్నారు.

