విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి…
వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం
స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, ఏప్రిల్ 29: జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల (EMRS) విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమంపై జిల్లా కలెక్టర్ నిషాంతి టి. సమగ్ర సమీక్ష నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో EMRS ప్రిన్సిపల్స్, ఐటిడిఏ, గిరిజన సంక్షేమ, ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.గత మూడు సంవత్సరాల 10వ, 12వ తరగతి ఫలితాలను పరిశీలించిన కలెక్టర్, పలు పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు రిమిడియల్ తరగతులు, బ్రిడ్జ్ కోర్సులు నిర్వహించడంతో పాటు NEET, JEE వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించాలని సూచించారు.విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా కెరీర్ గైడెన్స్ బుక్‌లెట్స్ తయారీకి కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం “EMRS సూపర్-100” కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల ద్వారా జాతీయ స్థాయి పరీక్షలకు సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పాఠశాల భవనాల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించిన కలెక్టర్, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అరకు వ్యాలీ, పాడేరు, హుకుంపేట, అనంతగిరి, జి.మాడుగుల ప్రాంతాల్లో భవనాల నిర్మాణం 2026 ఆగస్టు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.తాగునీటి సమస్యలపై కూడా దృష్టి సారిస్తూ, ముంచింగ్‌పుట్ పాఠశాలకు రూ.49.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇతర పాఠశాలలకు ప్రత్యామ్నాయ నీటి వనరుల ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, బాలికల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలల్లో సీసీటీవీ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం, సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఆరోగ్యం, పరిశుభ్రత, పోషణపై దృష్టి సారిస్తూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థుల ప్రగతిని పర్యవేక్షించేందుకు తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాలు (PTMs) క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.జిల్లాలోని EMRS పాఠశాలల సమగ్ర అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నిషాంతి టి. పిలుపునిచ్చారు.

