ఎస్టీ నియోజకవర్గాల్లో జనసేన గ్రాఫ్‌పై సర్వే ఫోకస్
గిరిజన ప్రాంతాల్లో పవన్ అభివృద్ధి రాజకీయ ఫలితం ఎంత?
ఉత్తరాంధ్రలో సర్వే బృందాల పర్యటనపై ఆసక్తి
పునర్విభజనతో పెరగనున్న ఎస్టీ సీట్లపై ముందస్తు వ్యూహం
ట్రైబల్ ఓటు బ్యాంక్‌పై జనసేన దీర్ఘకాల ప్లాన్
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గాలపై జనసేన ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రభావం ఎంతవరకు రాజకీయంగా మారిందో అంచనా వేయడానికి ఉత్తరాంధ్రలో ప్రత్యేక సర్వే బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం.
పొలిటికల్ బ్యూరో, పెన్ పవర్, కాకినాడ, ఏప్రిల్ 16:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గాలపై జనసేన పార్టీ ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రభావంపై ఒక ప్రత్యేక సర్వే బృందం ఫీల్డ్‌లో పని చేస్తున్నట్లు సమాచారం. ఈ సర్వే ప్రధానంగా ఎస్టీ ఓటు బ్యాంక్‌లో జనసేనకు పెరుగుతున్న ఆదరణ, కూటమి ప్రభుత్వ పనితీరుపై గిరిజనుల అభిప్రాయం, స్థానిక నాయకత్వ బలం వంటి అంశాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. విశాఖ, అల్లూరి, ఏజెన్సీ belt ప్రాంతాల్లో పలు గ్రామాలను సందర్శిస్తూ గ్రౌండ్ రిపోర్ట్ సేకరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. అడవీశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో కొండ శిఖర గ్రామాలకు రహదారులు, తాగునీటి సదుపాయాలు, ప్రాథమిక వసతులు, పాఠశాల–ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడిందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక ఎస్టీ పార్లమెంట్ స్థానం ఉన్న నేపథ్యంలో, భవిష్యత్తులో పునర్విభజన తర్వాత ఈ సంఖ్య పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని జనసేన ముందస్తు వ్యూహంతో కదులుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీకి పరిమిత ప్రభావం ఉన్న ఈ బెల్ట్ లో పవన్ కళ్యాణ్‌ను ఫేస్‌గా నిలబెట్టి జనసేన ఓటు బ్యాంక్‌ను బలోపేతం చేయాలనే ఆలోచన కనిపిస్తోంది.మరోవైపు గిరిజన ఓటర్లు గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ వైపు మొగ్గు చూపిన నేపధ్యంలో, ఇప్పుడు ఆ స్పేస్‌ను జనసేన ఆక్రమించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా భవిష్యత్ ఎన్నికల్లో ఎస్టీ సీట్లలో మరింత వాటా, బలమైన అభ్యర్థుల ఎంపిక, ప్రత్యేక ట్రైబల్ మేనిఫెస్టో వంటి వ్యూహాలకు పార్టీ రూపకల్పన చేసే అవకాశం కనిపిస్తోంది.

