మద్దతు ధర కల్పించాలని వానపల్లి రైతుల ఆందోళన
కొత్తపేట, పెన్ పవర్, మే 16:
కొత్తపేట మండలం వానపల్లి కోఆపరేటివ్ బ్యాంకు వద్ద రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. మొక్కజొన్నకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400 ఉండగా, దళారీలు కేవలం రూ.1700కే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో క్వింటాల్‌కు సుమారు రూ.700 వరకు నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో తక్కువ ధరలకు పంట అమ్ముకోవాల్సి రావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం పెంచిన మద్దతు ధరను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, రైతులకు సబ్సిడీలు అందించి ఆదుకోవాలని కోరారు. వానపల్లిని స్వర్ణ గ్రామంగా ప్రకటించిన ప్రభుత్వం, ఇదే ప్రాంత రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మొక్కజొన్న ,వరి కొనుగోలు చేసేయని ఇప్పుడు ఆ పరిస్థితికి ప్రస్తుత ప్రభుత్వం భిన్నంగా ఉందని రైతులు ఎద్దేవా చేశారు. వెంటనే జోక్యం చేసుకుని రైతులకు కలిగిన నష్టాన్ని భర్తీ చేయడంతో పాటు, రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వానపల్లి ప్రాంతానికి చెందిన రైతులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

