ePaper
Monday, June 8, 2026
ePaper

పార్టీలకతీతంగా భూ దందాలు!

📰 Generate e-Paper Clip

 

కావలిలో అక్రమ లేఔట్ల వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తు వేగం

అధికారులపై ఒత్తిళ్లు, బెదిరింపుల వెనుక ఎవరు?

అధికార మార్పుతో రంగులు మార్చిన భూ మాఫియా?

వంద కోట్ల ప్రభుత్వ భూములపై అక్రమాల బట్టబయలు

నివేదిక ముందు ఉక్కిరిబిక్కిరవుతున్న సూత్రధారులు

 

వైసీపీ హయాంలో సాగిన భూ దందాలపై విజిలెన్స్ ఉచ్చు బిగుస్తుండగా… అక్రమార్కులు ఇప్పుడు అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతో చేతులు కలిపి దర్యాప్తును ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కావలిలో సంచలనంగా మారింది. వంద కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూముల ఆక్రమణ, నకిలీ పట్టాలు, అక్రమ లేఔట్ల వ్యవహారంలో కీలక సూత్రధారులను విజిలెన్స్ గుర్తించినట్లు సమాచారం. విచారణ తుది దశకు చేరుతున్న వేళ అధికారులపై ఒత్తిళ్లు, బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.

స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్, నెల్లూరు, జూన్ 8:

కావలి నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో సాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారీ భూ దందాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఔట్లు వేయడం, కాలువలు మరియు ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పట్టా భూములుగా చూపిస్తూ రిజిస్ట్రేషన్లు నిర్వహించడం వంటి అక్రమాలపై ప్రస్తుతం విజిలెన్స్ విభాగం లోతైన దర్యాప్తు చేపడుతోంది. ఈ విచారణలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయని సమాచారం.

రికార్డుల కోసం అధికారుల పోరాటం

అక్రమ లేఔట్లపై దర్యాప్తు ప్రారంభించిన విజిలెన్స్ అధికారులకు తొలిదశలోనే పలు అవరోధాలు ఎదురైనట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖ నుంచి అవసరమైన రికార్డులు అందించడంలో కింది స్థాయి అధికారులు ఆసక్తి చూపలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు జిల్లా కలెక్టర్ జోక్యంతో రికార్డులు సేకరించిన అధికారులు సుమారు 78 లేఔట్లను పరిశీలించినట్లు సమాచారం. ప్రాథమిక పరిశీలనలోనే అనేక అవకతవకలు బయటపడినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

300 ఎకరాలపై కన్నేసిన భూ మాఫియా?

ప్రాథమిక అంచనాల ప్రకారం ముగ్గురు కీలక వ్యక్తులు అధికార ప్రభావాన్ని అడ్డం పెట్టుకుని సుమారు 300 ఎకరాల్లో అక్రమ లేఔట్లు అభివృద్ధి చేసినట్లు విజిలెన్స్ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఈ భూముల విలువ రూ.100 కోట్లకు మించి ఉంటుందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.


రంగులు మార్చిన అక్రమార్కుల వ్యూహం?

విచారణ ముమ్మరమవుతున్న కొద్దీ అక్రమాలకు పాల్పడిన కొందరు వ్యక్తులు రాజకీయ రంగులు మార్చి కొత్త సమీకరణాలకు శ్రీకారం చుట్టినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గతంలో అధికారంలో ఉన్న నేతలకు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులతో సన్నిహిత సంబంధాలు పెంచుకుని దర్యాప్తును ప్రభావితం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి.

అధికారులపై దౌర్జన్యాలు ఎందుకు?

విజిలెన్స్ విచారణ తుది దశకు చేరుకుంటున్న సమయంలో అధికారులపై ఒత్తిళ్లు, బెదిరింపులు పెరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల జరిగిన ఒక ఘటనలో అధికారుల విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం జరిగిందన్న వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ ఉన్నతాధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకునేందుకు కొందరు నేతలు తెరవెనుక నుంచి వ్యవహరిస్తున్నారన్న ప్రచారం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్లపై కూడా నిఘా

ఇప్పటికే అక్రమ లేఔట్లకు సంబంధించి కీలక సూత్రధారులను గుర్తించిన విజిలెన్స్ అధికారులు, వారికి సహకరించిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురి వాంగ్మూలాలు కూడా రికార్డు చేస్తున్నారని సమాచారం. అయితే విచారణకు సహకరించవద్దంటూ కొందరిపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

నోరు మెదపని నేతలపై అనుమానాలు

ఇంతటి వివాదం చెలరేగుతున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు, కీలక పార్టీ నేతలు బహిరంగంగా స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అక్రమ లేఔట్ల వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావాలంటే విచారణను పూర్తి స్వేచ్ఛతో కొనసాగించాల్సిందేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

నెలాఖరు నివేదికపై ఉత్కంఠ

ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు నెలాఖరులోపు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. నివేదిక వెలువడితే అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశముందన్న చర్చ సాగుతోంది. దీంతో భూ దందాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్గాల్లో ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇన్ని ఒత్తిళ్లు, రాజకీయ జోక్యాల మధ్య విజిలెన్స్ విచారణ నిష్పక్షపాతంగా పూర్తవుతుందా? అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు ఉంటాయా? అన్నది ఇప్పుడు కావలి ప్రజల్లో ఉత్కంఠగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular