గొల్లపాలెం హైస్కూల్లో డైనింగ్ హాల్ షెడ్ నిర్మించిన తాడి రామారెడ్డి
మెగా పీటీఎం–4.0లో మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభం..
సేవాభావాన్ని కొనియాడి సత్కారం
- కాజులూరు, జూలై 24 (పెన్ పవర్): సమాజ సేవలో ముందుంటూ విద్యార్థుల సంక్షేమానికి విశేషంగా తోడ్పడుతున్న శలపాక సాగునీటి సంఘం అధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త తాడి రామారెడ్డి (టీఎంఆర్) మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. కాజులూరు మండలంలోని గొల్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భోజనం చేసే సమయంలో పడుతున్న ఇబ్బందులను గుర్తించి, వారి కోసం ఆధునిక డైనింగ్ హాల్ షెడ్ నిర్మించి అందించారు.శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం–4.0) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ డైనింగ్ హాల్ షెడ్‌ను ప్రారంభించారు. అనంతరం తాడి రామారెడ్డి సేవలను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, విద్యార్థుల అవసరాలను గుర్తించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వంతో పాటు సమాజంలోని దాతలు కూడా విద్యాభివృద్ధికి చేయూతనిస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

విద్యార్థులు ఎండ, వర్షాల మధ్య ఇబ్బందులు పడకుండా భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధిపై తాడి రామారెడ్డి చూపుతున్న చొరవను కొనియాడారు.తాడి రామారెడ్డి సేవలు కేవలం పాఠశాలలకే పరిమితం కాకుండా,పలు గ్రామాల్లో సామాజిక, ధార్మిక కార్యక్రమాలకు విస్తరించాయి. ఇటీవల మరో గ్రామంలోని ఆలయానికి వచ్చే భక్తులు ఎండ, వర్షాల సమయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని,కేవలం వారం రోజుల్లో ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్ నిర్మించి అందించారు. అలాగే గొల్లపాలెంలోని ఓ దేవాలయానికి టైల్స్ వేయించడం వంటి పలు సేవా కార్యక్రమాలను కూడా చేపట్టి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.
మెగా పీటీఎం కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం, విద్యాభివృద్ధి చర్యలపై వివరించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు చవ్వాకుల నారాయణమూర్తి,జనసేన మండల అధ్యక్షుడు బొండా వెంకన్న, టీడీపీ సీనియర్ నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి, కోట తాతబ్బాయి, అంగర కృష్ణ, తోట కృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్ దడాల నాగార్జున, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయురాలు సుశీల, పీడీ సునీల్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

