ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం, జూలై 4: విశాఖ నగరంలో పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఎకో టూరిజాన్ని మరింత ప్రోత్సహించే దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ఎం. శ్రీభరత్ తెలిపారు. కైలాసగిరి, ఇందిరా గాంధీ జూ పార్క్, కంభాలకొండ ప్రాంతాలను అనుసంధానిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా అభివృద్ధి చేపట్టనున్నట్లు వెల్లడించారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్, జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్ర దామా, జూ క్యురేటర్ మంగమ్మ, సింగపూర్‌కు చెందిన మాందాయ్ సంస్థ, బెంగళూరుకు చెందిన ఇంటిగ్రేటెడ్ డిజైన్ సంస్థ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ ఈ విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే పర్యాటక హబ్‌గా గుర్తింపు పొందిన విశాఖలో ప్రకృతి అందాలను పరిరక్షిస్తూ ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. విశాఖలోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి భంగం కలగకుండా, అటవీశాఖ, వీఎంఆర్డీఏ, పర్యాటక శాఖ, జీవీఎంసీ అధికారుల సమన్వయంతో సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.కైలాసగిరి, కంభాలకొండ వంటి ప్రకృతి రమణీయ ప్రాంతాల్లో సాహస క్రీడలు, ఇతర ఆకర్షణీయ పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో పర్యాటక అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో నైట్ సఫారీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కూడా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
మొదటి దశలో పర్యాటకులు, స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా అభివృద్ధి ప్రతిపాదనలు రూపొందించి, త్వరలోనే పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఎంపీ శ్రీభరత్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్ దాట్ల కీర్తి, ముఖ్య ప్రణాళిక అధికారి దివ్యలత, ఓఎస్డీ కృష్ణ నాయక్, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, ఎస్‌ఈ రాంబాబు, కార్యనిర్వహక ఇంజనీర్ సుధీర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

