గార్ల, పెన్ పవర్, ఆగస్టు 25:
మున్నేరు నీటిని పాలేరు వైపు తరలించే ప్రయత్నాలను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్ రైతులను కోరారు. మున్నేరు పాలేరు లింక్ కెనాల్ పేరుతో రైతులను మభ్యపెట్టి రహస్యంగా సంతకాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పూర్తి వివరాలు తెలియజేయకుండా ఇప్పటికే పలువురు సంతకాలు చేశారని మీరూ చేయండి అంటూ కొందరు సంతకాలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి పత్రంపైనైనా సంతకం చేసే ముందు దాని ఉద్దేశం, పూర్తి వివరాలు తెలుసుకోవాలని రైతులకు సూచించారు.మున్నేరు నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల గార్ల, బయ్యారం ప్రాంతాల్లో సాగునీరు, తాగునీటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్నేరు పాలేరు లింక్ కెనాల్ కారణంగా గార్ల మండల రైతులకు నష్టం జరుగుతుందని గతంలోనూ రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందేననిమున్నేరు నీటిని తరలించే బదులు గార్ల, బయ్యారం మండలాల్లోని చెరువులను పూర్తిస్థాయిలో నింపాలని డిమాండ్ చేశారు. చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనిమున్నేరు నీటి విషయంలో రైతులంతా కుల, రాజకీయ భేదాలకు అతీతంగా ఏకతాటిపై నిలవాలని, పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి సంతకాలు చేయవద్దని పిలుపునిచ్చారు. గార్ల, బయ్యారం ప్రాంతాల నీటి అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.

