సద్గురు శివానంద మూర్తి అడుగు జాడల్లో అందరూ నడవాలి
శివానంద కల్చరల్ సెంటర్ నిర్మాణ ప్రారంభోత్సవ సభలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 8 : సద్గురు శ్రీ శివానంద మూర్తి చూపిన ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. సద్గురు శ్రీ శివానంద మూర్తి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిపాదిత “శివానంద కల్చరల్ సెంటర్” నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం వీఎంఆర్‌డీఏ ఏరీనాలో ఘనంగా నిర్వహించారు.
సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, భీమిలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ సనాతన ధర్మ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సద్గురు శివానంద మూర్తి సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడం ఆయన భవిష్యత్ దార్శనికతకు నిదర్శనమన్నారు. సనాతన ధర్మ విలువలు, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రజల్లో మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు నిర్మాణం కానున్న శివానంద కల్చరల్ సెంటర్ ఒక చిరునామాగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా గురు విశ్వపతి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్.వి. సుబ్రహ్మణ్యం, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ట్రస్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్. రాఘవేంద్రన్, కందుకూరి రాజ్, శ్రీమతి కె. రాజేశ్వరి, వరంగల్ గురుధాం ప్రతినిధి గోపీచంద్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శివానంద కల్చరల్ సెంటర్ నిర్మాణానికి సంబంధించిన బ్రోచర్‌ను అతిథులు ఆవిష్కరించారు.
ఆకట్టుకున్న ‘శ్రీ మహాలక్ష్మీ వైభవం’ కచేరీ
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘శ్రీ మహాలక్ష్మీ వైభవం’ సాంస్కృతిక కచేరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. త్యాగరాజ స్వామి వైకుంఠ వర్ణన, చూర్ణికతో ప్రారంభమైన ఈ కచేరీ ఆద్యంతం శ్రోతలను ఆధ్యాత్మిక తరంగాల్లో ఓలలాడించింది.
వ్యాఖ్యాన సహితంగా సాగిన కచేరీలో శ్రీ మహాలక్ష్మీ తత్త్వాన్ని కళాకారులు ఆవిష్కరించారు. వినయ్ ఎల్. వారణాసి కథకుడిగా వ్యవహరించగా, అర్చన, కుమారి సమన్వి గాత్రంతో అలరించారు. వీణపై రక్షిత రమేష్, మృదంగంపై ఆదమ్య రామానంద్ సహకారం అందించారు. భక్తి, సంగీతం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా సాగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

