మాడుగుల డిగ్రీ కళాశాల ఇక మోడల్ కాలేజీ
రూ.కోటి ఎంపీ నిధులతో నూతన భవనాల ప్రారంభం
ప్లేగ్రౌండ్, ఓపెన్ జిమ్, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు సహా అన్ని సదుపాయాలు కల్పిస్తా: ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, అనకాపల్లి / మాడుగుల, ఆగస్టు 8 : మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సి.ఎం. రమేష్ తెలిపారు. సుమారు 18 ఏళ్లుగా మాడుగుల ప్రజలు, విద్యార్థులు ఎదురుచూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాల కల సాకారమైందన్నారు. రూ.కోటి ఎంపీ నిధులతో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని శనివారం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి ఎంపీ ప్రారంభించారు.
కళాశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ దింసా నృత్యాలు, గీతాలాపనలతో అతిథులను ఆహ్వానించి తమ సంస్కృతిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎంపీ సి.ఎం. రమేష్ మాట్లాడుతూ రూ.కోటి ఎంపీ నిధులతో 250 మంది విద్యార్థులకు ఉపయోగపడేలా ఎనిమిది ఆధునిక తరగతి గదులు, ప్రిన్సిపాల్ గది, బాలురు, బాలికలకు ప్రత్యేక టాయిలెట్ బ్లాకులను నిర్మించినట్లు తెలిపారు. కేవలం భవనాలు నిర్మించడం మాత్రమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమన్నారు.
విశాఖ కళాశాలలకు దీటుగా అభివృద్ధి
మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మోడల్ కాలేజీగా తీర్చిదిద్దడంతో పాటు విశాఖపట్నంలోని ప్రముఖ కళాశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తామని ఎంపీ ప్రకటించారు. కళాశాలకు చెందిన ఐదు ఎకరాల ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ప్లేగ్రౌండ్, ఓపెన్ జిమ్, ఆర్వో వాటర్ ప్లాంట్, కాంపౌండ్ వాల్, అప్రోచ్ సీసీ రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, కంప్యూటర్లు, ఫర్నిచర్, ఇతర విద్యా సామగ్రిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం లేదా సీఎస్‌ఆర్ నిధులు అందకపోయినా అవసరమైతే సొంత నిధులతోనైనా కళాశాలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తానని స్పష్టం చేశారు.
టెండర్ల కోసం ఎదురుచూడను
కళాశాల ప్రాంగణం అభివృద్ధిలో జాప్యం జరగకూడదని ఎంపీ అన్నారు. టెండర్లు, కాంట్రాక్టర్ల కోసం ఎదురుచూడకుండా కొన్ని రోజుల్లోనే యంత్రాలను పంపించి కళాశాల ప్రాంగణాన్ని చదును చేసి గ్రౌండ్‌ను సిద్ధం చేస్తానని హామీ ఇచ్చారు.
“భవనం మేము నిర్మించాం.. భవిష్యత్తును మీరు నిర్మించుకోవాలి” అంటూ విద్యార్థులకు ఎంపీ పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణ విద్యార్థులతో సమానమైన విద్యా అవకాశాలు కల్పించాలన్నదే తన లక్ష్యమన్నారు. మాడుగుల కళాశాల నుంచి భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజినీర్లు, అధికారులు, పారిశ్రామికవేత్తలు ఎదగాలని ఆకాంక్షించారు.
రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎంపీ తెలిపారు. జిల్లాలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడంతో పాటు సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
మాడుగుల–చోడవరం–నర్సీపట్నం మీదుగా జాతీయ రహదారి
మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి రహదారి అనుసంధానం ఎంతో కీలకమని ఎంపీ పేర్కొన్నారు. మాడుగుల–చోడవరం–నర్సీపట్నం మీదుగా కొత్త జాతీయ రహదారి అనుసంధానం జరిగేలా కేంద్ర స్థాయిలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పినగాడి–పాడేరు రహదారి అభివృద్ధి డీపీఆర్ దశకు రావడంలోనూ తన వంతు కృషి ఉందన్నారు.
అయోధ్య–కాశీ దివ్యదర్శన యాత్రలో తొలి దశలో అవకాశం లభించని వారికి కూడా భవిష్యత్‌లో అవకాశం కల్పిస్తామని ఎంపీ తెలిపారు. శ్రీరామ జన్మభూమి అయోధ్య, కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం చేయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మాడుగుల అభివృద్ధిపై ఎంపీ ప్రత్యేక దృష్టి
ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీ సి.ఎం. రమేష్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. మాడుగుల వచ్చిన ప్రతిసారీ కొత్త అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకురావాలనే ఆలోచనతో ఎంపీ పనిచేస్తున్నారని తెలిపారు. పినగాడి–పాడేరు రహదారి డీపీఆర్ దశకు రావడంలో ఎంపీ చొరవ కీలకమని పేర్కొన్నారు.
కళాశాల నూతన భవనాల ప్రారంభం అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు ఎంపీ సి.ఎం. రమేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవనాల నిర్మాణంతో పాటు అడగకుండానే అదనపు సదుపాయాలు కల్పించేందుకు ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. “అడిగితే పెట్టేది అమ్మ.. అడగకుండానే అవసరాన్ని గుర్తించి ఇచ్చేది అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్” అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఎంపీ, ఎమ్మెల్యేలతో ఫొటోలు దిగారు.

