Homeఆంధ్రప్రదేశ్అమరావతిబెజవాడకు చేరిన ‘ప్రెసిడెన్షియల్’ పోరాటం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజును కలిసిన జీవీఎంసీ మినిస్టీరియల్...

బెజవాడకు చేరిన ‘ప్రెసిడెన్షియల్’ పోరాటం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజును కలిసిన జీవీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగులు

బెజవాడకు చేరిన ‘ప్రెసిడెన్షియల్’ పోరాటం

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజును కలిసిన జీవీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగులు

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్          విజయవాడ, ఆగస్టు 13: ప్రెసిడెన్షియల్ ఉత్తర్వుల నుంచి జీవీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగులను మినహాయించి, వారందరినీ ఒకే యూనిట్‌గా కొనసాగించాలని కోరుతూ ఉద్యోగులు చేపట్టిన పోరాటం విజయవాడకు చేరింది. ఈ మేరకు జీవీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగులు పలువురు ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి గురువారం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లును కలిసి తమ సమస్యలను వివరించారు.

జీవీఎంసీలో మినిస్టీరియల్ ఉద్యోగులందరినీ ఒకే యూనిట్‌గా కొనసాగించడంతో పాటు నియామక అధికారిగా జీవీఎంసీ కమిషనర్‌నే కొనసాగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. గత నెల 24న విడుదలైన జీవో 135ను పునఃపరిశీలించి, ఉద్యోగులకు న్యాయం జరిగేలా సవరించిన ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

‘విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1979’ నిబంధనల ప్రకారమే జీవీఎంసీ నిర్వహించబడుతోందని ఉద్యోగులు బొప్పరాజు దృష్టికి తీసుకువచ్చారు. మినిస్టీరియల్ విభాగం మొదటి నుంచి ఒకే యూనిట్‌గా పనిచేస్తోందని, దీనికి అనుగుణంగానే ప్రత్యేక సర్వీసు నిబంధనలు రూపొందించబడ్డాయని తెలిపారు. ఇప్పటివరకు జీవీఎంసీ ఉద్యోగుల సర్వీసును రాష్ట్ర స్థాయి సర్వీసులో విలీనం చేసే ప్రక్రియ చేపట్టలేదని పేర్కొన్నారు.

స్థానిక సంస్థలకు చట్టబద్ధమైన గ్రాంట్లు విడుదల చేయడానికి బదులుగా ప్రభుత్వం ద్వారా జీతాలు చెల్లిస్తున్నప్పటికీ, ఉద్యోగుల సర్వీస్‌ షరతులు మాత్రం ‘విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1979’తో పాటు దాని కింద రూపొందించిన ప్రత్యేక సర్వీస్ నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయని వివరించారు. అందువల్ల తమను రాష్ట్ర స్థాయి సర్వీసుగా కాకుండా జీవీఎంసీ పరిధిలో ఒకే యూనిట్‌గా పరిగణించాలని కోరారు.

ఉద్యోగుల సమస్యలను విన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందిస్తూ, జీవీఎంసీ మినిస్టీరియల్ ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

బొప్పరాజును కలిసిన వారిలో వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వీవీ వామనరావు, జీవీఎంసీ ఏఐటీయూసీ అధ్యక్షుడు పడాల రమణ, గొంప కుమార్, ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తిమ్మపర్తి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అక్కరబోయిన అప్పలరాజు, కోశాధికారి రవి, జీవీఎంసీ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. అప్పలనాయుడు, సన్నీ, లంకా రాంప్రసాద్, వి. శ్రీనివాసరావు, రాజేష్, జగన్, ప్రసన్నకుమార్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular